IT News: ప్రపంచంలోని టాప్ కంపెనీల పేర్లు చెప్పమంటే వెంటనే గుర్తొచ్చేవి మైక్రోసాఫ్ట్, ఆపిల్, గూగుల్, ఫేస్ బుక్ వంటి ఐటీ కంపెనీలే. ఆర్థికంగా, సాంకేతికంగా ఉన్నత స్థాయిలో ఉండటంతో వాటిని దిగ్గజ సంస్థలుగా భావిస్తున్నారు. కానీ అన్ని విషయాల్లోనూ వాటిని పెద్ద కంపెనీలుగా పరిగణించలేం. విభాగాల వారీగా పరిశీలిస్తే, వాటిని మించిన స్థాయిలో దూసుకుపోతున్న సంస్థలు అనేకం. అలా చూస్తే, ప్రపంచంలోని టాప్ 5 సంస్థలు ఏవో ఇప్పుడు చూద్దాం.

అగ్రస్థానంలో ఉన్న కంపెనీ..
గూగుల్, ఫేస్ బుక్ వంటి సంస్థలకు వివిధ దేశాల్లో కార్యాలయాలు ఉన్నాయి. అందులో వేలాది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కానీ అత్యధిక సిబ్బంది కలిగి ఉన్న టాప్ 5 కంపెనీల్లో మాత్రం ఈ దిగ్గజ సంస్థలు చోటు దక్కించుకోలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉద్యోగులతో వాల్ మార్ట్ అగ్రస్థానంలో నిలిచింది. పలు వ్యాపార సంస్థలతో ఉన్న భాగస్వామ్యం కారణంగా పెద్ద మొత్తంలో సిబ్బంది అందులో పని చేస్తున్నారు. మొత్తం ఉద్యోగుల సంఖ్య 23 లక్షలకు పైమాటే కాగా కాంట్రాక్ట్ విధానంలో మరో లక్ష మంది పరోక్షంగా విధులు నిర్వర్తిస్తున్నారు.

తర్వాత 4 స్థానాల్లోని కంపెనీలివే..
అంతర్జాతీయ స్థాయిలో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీగా ఖ్యాతి గడించిన అమెజాన్, ఉద్యోగుల సంఖ్యలో మాత్రం రెండో స్థానానికే పరిమితమైంది. మొత్తం 15.5 లక్షల మంది ఈ కంపెనీలో పని చేస్తున్నారు. మూడేళ్ల క్రితం భారీగా ఉద్యోగులను నియమించుకోగా.. తాజాగా కొంతమందిని తొలగించింది. అనంతరం అత్యధిక ఉద్యోగులతో ఫాక్స్ కాన్ మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ 8.25 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా 7.38 లక్షల మందితో యాక్సెంచర్ నాలుగో స్థానం, 6.4 లక్షల మందితో వోక్స వ్యాగన్ 5వ స్థానంలో ఉన్నాయి

టాప్ 5లో లేకపోయినా TCS మాత్రం..
టాప్ 5 లో ఏ భారతీయ కంపెనీ స్థానం దక్కించుకోలేకపోయింది. కానీ దేశీయ IT దిగ్గజం TCS మాత్రం ఆరవ స్థానంలో నిలిచింది. లక్షల రూపాయలు జీతాలుగా చెల్లిస్తున్న పెద్ద కంపెనీలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా తమ సిబ్బందిని తొలగిస్తున్నాయి. అయితే లేఆఫ్ ల ఊసే లేకుండా టాటా గ్రూపు కంపెనీ దూసుకపోతోంది. టాప్ 5 లో ఇండియన్ కంపెనీ సైతం ఉండటం త్వరలోనే చూడగలమని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications