Ambani-Adani: దేశంలో సంపన్నులు అనగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చేది సహజంగా అంబానీ లేదా అదానీలే. కానీ వాస్తవంగా వీరి కంటే అధికంగా నికర విలువను కలిగిన సంపన్నులు ముగ్గురు ఉన్నారని వెళ్లడైంది.
ఈ ఏడాది నికర విలువ పెంచుకున్న వారిలో సైరస్ పూనావాలా, సావిత్రి జిందాల్, కుమార్ మంగళం బిర్లాలు భారత బిలియనీర్ల జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఈ సమయంలో పూనావాలా 5.01 బిలియన్ డాలర్లు, సావిత్రి 4.81 బిలియన్ డాలర్లు పెరగగా.. ఇక బిర్లా సంపద 4.43 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈ సమయంలో ముఖేష్ అంబానీ సంపద 942 మిలియన్ డాలర్లు మాత్రమే పెరగగా.. గౌతమ్ అదానీ సంపద మాత్రం 56.7 బిలియన్ డాలర్లు కోల్పోయారు.

అదానీ సంపద ఆవిరి కావటంతో ఆసియాలోని సంపన్నుల టాప్ జాబితా నుంచి ఆయన పేరు కనుమరుగైన సంగతి తెలిసిందే. నికర విలువ పరంగా ఆసియాలో గౌతమ్ ఆదానీ రెండవ స్థానానికి పరిమితమయ్యారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌లో టాప్-20 జాబితాలో అదానీ పేరు లేదు. 2022లో సంపాదనలో నంబర్‌వన్‌గా ఉన్న అదానీ.. ఈ ఏడాది మాత్రం సంపద కోల్పోవడంలో నంబర్‌వన్‌గా నిలిచారు. హిండెన్‌బర్గ్ షాక్ కారణంగా దాదాపు 56.7 బిలియన్ డాలర్లు తక్కువగా ప్రస్తుతం 63.8 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానానికి పరిమితమయ్యారు.
గతేడాది అత్యధిక సంపదను కోల్పోయిన బిలియనీర్లు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్‌బర్గ్, జెఫ్ బెజోస్ ఈ ఏడాది టాప్ గెయినర్లుగా నిలిచారు. ఈ ఏడాది మస్క్ సంపద 95 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యధిక సంపదను ఆర్జించడంలో మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఆయన సంపద 63.4 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆదాయాల జాబితాలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ పేరు మూడో స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఆయన తన నికర విలువను 43.9 బిలియన్ డాలర్ల మేర పెంచుకున్నారు.


Click it and Unblock the Notifications