Gautam Adani: ఆస్తి, వ్యాపారం, సంపద లాగానే కుబేరుడు అదానీ మనసు కూడా పెద్దదే. ఆయన దాతృత్వం గురించి ఇన్నాళ్లు మనం వార్తల్లో వినే ఉంటాం. కానీ ఇప్పుడు ఆయన సాయాన్ని నేరుగా చూసే అరుదైన అవకాశం వచ్చింది. నాలుగేళ్ల Manushree అనే చిన్నారికి పునర్జన్మనివ్వటానికి సిద్ధమయ్యారు.
పాప అనారోగ్యం..
ఉత్తర్‌ప్రదేశ్ లక్నోలోని సరోజినీ నగర్ ప్రాంతంలో నివసించే నాలుగేళ్ల చిన్నారి మనుశ్రీ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ చిన్నారి గుండెకు రంధ్రం ఉండటంతో చికిత్సకు రూ.1.25 లక్షలు అవసరమని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తెలిపారు. అయితే ఆమె కుటుంబం ఇంత ఖర్చును భరించే స్తోమత లేనందున సాయం కోసం ప్రయత్నించారు. అషుతోష్ త్రిపాఠీ అనే వ్యక్తి పాప చితిక్సకు సాయం కోరుతూ యూపీఐ స్కాన్ కోడ్ కలిగిన ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. పోస్ట్ చూసినవారు తోచినంత సాయం చేయాలని అందులో వారు కోరారు.

స్పందించిన అదానీ..
అయితే చిన్నారి ఆరోగ్య సమస్యకు అవసరమైన సాయం కోరుతున్న ట్వీట్ కు భారత కుబేరుడు గౌతమ్ అదానీ స్పందించారు. సదరు ట్వీట్ కు బదులిస్తూ.. మనుశ్రీ అతి త్వరలోనే కోలుకుంటుందని రాశారు. ఈ నాలుగేళ్ల చిన్నారి కుటుంబాన్ని వెంటనే సంప్రదించాలని అదానీ పౌండేషన్ ను ట్యాగ్ చేశారు. చికిత్సకు అవసరమైన పూర్తి సహాయాన్ని అందించాలని సూచించారు. చిన్నారి మనుశ్రీ అతి త్వరలోనే తిరిగి స్కూల్ కి వెళుతుందని.. మునుపటి లాగానే తన మిత్రులతో ఆడుకుంటుందని ఆయన ఆకాంక్షించారు.

అభినందనల వెల్లువ..
నిరంతరం వ్యాపార పనుల్లో బిజీగా ఉండే అదానీ ఒక్క ట్వీట్ ద్వారా చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకు రావటంపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ప్రయత్నాలను నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇది ఎందరికో ప్రేరణగా నిలుస్తుందని మరికొందరు ఆకాంక్షించారు. ఒక ట్విట్టర్ వినియోగదారుడు గౌతమ్ అదానీ "అద్భుతమైన పని" కోసం దేవుడు మరింత సంపదతో ఆశీర్వదించాలని ఆకాంక్షించాడు. ఇలా అనేక మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

దాతృత్వంలో ఇలా..
సమాజానికి తన వంతు సాయం చేయటంలో అదానీ ముందంజలోనే ఉన్నారు. అక్టోబర్ 21న ప్రచురించబడిన EdelGive హురున్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2022లో ఆయన 7వ స్థానంలో నిలిచారు. ఇది సమాజంలోని చాలా మందికి సాయం చేయాలని ఆయనకు ఉన్న నిబద్ధతకు నిదర్శనం అని చెప్పుకోవచ్చు. అదానీ గ్రూప్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద.. అదానీ ఫౌండేషన్ కు రూ.122 కోట్లను అందించింది. దీనికి తోడు ఆయన 60వ పుట్టిన రోజు సమయంలో దాతృత్వానికి రూ.60,000 కోట్లు అందజేస్తామని హామీ కూడా ఇచ్చారు.


Click it and Unblock the Notifications