Dubai Realty: ఇండియా పేద దేశమా..? ఇది చూస్తే కాదని అనాల్సిందే!
Dubai Realty: భారతీయుల సంపదను, అంతర్జాతీయ విపణిలో వారి ఖర్చులను చూస్తుంటే ప్రపంచ దేశాలు సైతం ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. మొన్న ఎయిర్ ఇండియా 100 బిలియన్ డాలర్ల విమాన కొనుగోలు డీల్ చూసి ఆశ్చర్యపోయిన ప్రపంచం, తాజాగా దుబాయ్‌లోని అత్యంత ఖరీదైన విల్లా కోసం భారతీయులు బిడ్ దాఖలు చేయడంతో ఖంగు తింది.
విలాసవంతమైన విల్లాలు, ప్రైవేట్ ద్వీపాలకు దుబాయ్ ఎంతో ప్రసిద్ధి చెందింది. అందుకే పామ్ జుమేరాలో షారూఖ్ ఖాన్ ప్రైవేట్ ఐల్యాండ్, 650 కోట్లు వెచ్చించి సముద్రం ఫేసింగ్‌తో ముఖేష్ అంబానీ లగ్జరీ విల్లా ఇక్కడ కొనుగోలు చేశారు. తమ సంపదను కాపాడుకోవడానికి తాజాగా రష్యన్లు UAEకి తరలి రావడంతో దుబాయ్‌లోని విలాసవంతమైన గృహాలకు డిమాండ్ పెరిగింది.

అధిక నెట్‌వర్త్ కలిగిన కోటీశ్వరులు రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడుల కోసం చూస్తున్నందున దుబాయ్ వారికి మంచి గమ్యస్థానంగా మారింది. 2022లో దుబాయ్‌లో ఆస్తులు కొనుగోలు చేయడం కోసం భారతీయులు 35 వేల 500 కోట్లు ఖర్చు చేశారు. తాజాగా ఇప్పుడు దేశంలోని ఓ అత్యంత సంపన్న కొనుగోలుదారు.. 1,672 కోట్ల విలువైన అత్యంత ఖరీదు కలిగిన విల్లా సొంతం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు.
ఎమిరేట్స్ హిల్‌లోని ఈ విల్లా నిర్మాణానికి 223 కోట్ల కంటే ఎక్కువ విలువైన మార్బుల్స్ ఉపయోగించారు. ఇది వెర్సైల్స్‌ను గుర్తు చేస్తుంది. దీనిని మార్బుల్ ప్యాలెస్ అనే మారుపేరుతో వ్యవహరించవచ్చు. ఇందులో ఉన్న 5 బెడ్‌రూమ్‌లు.. ఒక్కొక్కటి 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. 60 వేల చదరపు అడుగుల కార్పెట్ ప్రాంతం, 19 బాత్‌రూమ్‌లు, పానిక్ రూమ్‌లు, పవర్ సబ్‌స్టేషన్లు అదనపు హంగులుగా చెప్పుకోవచ్చు.
ఈ విల్లాలో ఇండోర్ మరియు అవుట్‌డోర్ పూల్స్, 15 కార్ల కోసం పార్కింగ్ స్థలం, 80 వేల లీటర్ల నీటితో నిండిన కోరల్ రీఫ్ అక్వేరియం ఉన్నాయి. 7 లక్షల బంగారు లీఫ్స్ నిర్మించేందుకు మాత్రమే ప్రత్యేకంగా 70 మంది కార్మికులు పనిచేసినందున ఇది పూర్తికావడానికి 12 సంవత్సరాలు పట్టింది. ఈ ఇంటి బిడ్డర్‌లలోని ఒక భారతీయునికి దుబాయ్‌లో ఇప్పటికే మూడు ఆస్తులు ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications