Banking News: ప్రపంచ పెద్దన్న అమెరికాలో ఇటీవల ఒకదాని తర్వాత మరొక బ్యాంక్ కుప్పకూలటం మనందరం గమనించాం. ఆ తర్వాత ఇది దావానలంగా యూరోపియన్ బ్యాంకింగ్ రంగాన్ని సైతం తాకింది. అయితే ఇప్పుడు ఆ సెగ భారత్ వైపుకు మళ్లిందా అనే ఆందోళనలు రేకెత్తుతున్నాయి. భారీగా వడ్డీ రేట్ల పెంపు దుష్ఫలితాలు ఇప్పుడే మెుదలయినట్లు కనిపిస్తోంది.
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ నుంచి క్రెడిట్ సూయిస్ వరకు బ్యాంకులు పతనమైంది ప్రధానంగా ఒక్క కారణంతోనే.. అదే లిక్విడిటీ క్రంచ్. అంటే ద్రవ్యోల్బణం పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరగటాన్ని అదుపుచేసేందుకు.. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ వడ్డీ రేట్లను భారీగా పెంచుకుంటూ వచ్చాయి. దీంతో మార్కెట్లో డబ్బు లభ్యత తగ్గుతుంది. అయితే దీని కారణంగా దేశంలోని బ్యాంకుల వద్ద ఉండే మూలధనం సైతం తగ్గుతుందని మనం తెలుసుకోవాలి.

వరుస వడ్డీ రేట్ల వడ్డనలు బ్యాంకుల వద్ద నిధుల లభ్యతను భారీగా తగ్గించాయి. ఇది మూలధన కొరతకు ప్రేరేపించటంతో బ్యాంకింగ్ రంగంలోని డొల్లతనం బయటపడిపోయింది. దీంతో బ్యాంకులు కుప్పకూలాయి. అయితే ఇలాంటి పరిస్థితులు భారత్ లో కనిపించే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వంతో పాటు బ్యాంకింగ్ రంగంలోని నిపుణులు హామీ ఇచ్చాయి.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం దేశంలోని చాలా బ్యాంకులు తగినంత నిధుల లభ్యతను పెంచుకునేందుకు రంగంలోకి దిగాయి. లేకుంటే ఇవన్నీ మరో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ లాగా కుప్పకూలే ప్రమాదం ఉంది. తాజాగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర బోర్డు ఏప్రిల్ నెలలో రూ.7,500 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ వివరాలను బ్యాంక్ ఏప్రిల్ 19న స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. BASEL III లేదా అటువంటి ఇతర సెక్యూరిటీల జారీ ద్వారా మూలధనాన్ని పెంచే ఆప్షన్లను బోర్డు పరిశీలిస్తోంది.
ఈ పరిస్థితి దేశంలోని దిగ్గజ బ్యాంకింగ్ సంస్థ SBIని కూడా వేధిస్తోంది. దీంతో 2 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని బ్యాంక్ బోర్డు రెండు రోజుల కిందట నిర్ణయించింది. ఇందుకోసం దీర్ఘకాలిక రుణ సాధనాలను వినియోగించాలని తీర్మానించింది.
ఇదే సమయంలో బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం రూ.6,500 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. రానున్న కాలంలో మరిన్ని బ్యాంకులు ఇదే మార్గాన్ని ఎంచుకోవచ్చని బ్యాంకి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా రిజర్వు బ్యాంక్ వడ్డీ రేట్ల పెంపుని నిలిపివేస్తుందా లేక మరోసారి రేట్లు పెరుగుతాయో తెలియాల్సి ఉంది.


Click it and Unblock the Notifications