Air Fare: ఆగస్టు 31, 2022న కరోనా మహమ్మారి సమయంలో దేశీయ విమాన ప్రయాణాలపై విధించిన ఛార్జీల పరిమితులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. దీంతో విమానయాన సంస్థలు తమ ఛార్జీలను తగ్గించాలని భావించాయి. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే విమానయాన సంస్థలు పోటీపడి మరీ తన ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయి. దీని వల్ల పోటీతత్వం పెరగటంతో ప్రయాణికులు ఎక్కువగా లాభపడనున్నారు.

బిగ్ బుల్ సంస్థ ఇలా..
ఆగస్టులో ముంబై-బెంగళూరు విమానానికి ఆకాశ ఎయిర్ సంస్థ రూ.3,948 వసూలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ రేటును రూ.2,000-2,200 తగ్గించి మెగా ప్రకటన చేసింది. అంటే ప్రయాణికులకు దాదాపు 50 శాతం తగ్గింపు లభిస్తోంది. ముంబై నుంచి అహ్మదాబాద్‌కి వెళ్లడానికి కేవల రూ. 1,400గా ఛార్జీ ఉంది.

ఇండిగో & గోఫస్ట్..
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో, ఆకాశ ఎయిర్‌తో సమానంగా ఛార్జీలను ప్రకటిస్తూ గట్టి పోటీకి తెరలేపింది. ఇదే క్రమంలో పోటీని తట్టుకుని, ప్రయాణికులను నిలుపుకునేందుకు GoFirst కూడా త్వరలో ఛార్జీలను తగ్గించడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.

ఢిల్లీ - లక్నో మార్గంలో..
AirAsia, IndiGo సంస్థలు ఢిల్లీ-లక్నో మార్గంలో ధరలను రూ.4,000 నుంచి రూ.1900-2200కి తగ్గించాయి. అంటే దాదాపుగా 40 నుంచి 50 శాతం వరకు కంపెనీలు డిస్కౌంట్ అందిస్తున్నాయి. కొచ్చి-బెంగళూరు రూట్‌లో 1,100 - 1,300 వరకు ధరలను తగ్గించారు. ముంబై-జైపూర్ మార్గంలో టిక్కెట్ ధరను రూ.5,000 నుంచి రూ.3,900కి తగ్గించారు.

తగ్గింపులు ఎందుకు..?
ఈ ఛార్జీల తగ్గింపు కేవలం తక్కువ-ధర ఎయిర్‌లైన్ మార్కెట్‌ను పట్టుకోవడానికి మాత్రమే కాదు. డిమాండ్, పోటీ, ఆదాయ నష్టం తదితర కారణాలతో విమానయాన సంస్థలు ఈ ఛార్జీల తగ్గింపును చేస్తున్నాయని చెబుతున్నారు.

సీజన్ కాకపోవటంతో..
జూలై-సెప్టెంబర్ ఆఫ్-సీజన్, విమాన ప్రయాణీకుల రద్దీ తక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఛార్జీల రాయితీలను అందించడం ద్వారా రైలు ప్రయాణికులను ఆకర్షించేందుకు విమానయాన సంస్థలు ఛార్జీల తగ్గింపును ప్రకటిస్తుంటాయని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అయితే ప్రస్తుతం పండుగల సమయం వస్తున్నందున వినియోగదారులు ముందుగా ప్లాన్ చేసుకుంటే తగ్గింపులోనే ప్రయాణాన్ని పొందవచ్చు.

విమాన ఇంధన ఛార్జీలు..
గత వారం జెట్ ఇంధన ధరలు రెండేళ్ల గరిష్ఠానికి పెరిగాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) కోసం కొత్త ధరల వ్యవస్థ కోసం పరిశ్రమ ఎదురుచూస్తోందని విమానయాన అధికారి ఒకరు తెలిపారు. కొత్త జెట్ ఇంధన ధరల విధానం విమానయాన సంస్థలకు మాత్రమే కాకుండా విమాన టిక్కెట్ల ధరను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుందని పేర్కొంది. దేశంలో విమాన ఇంధన ఛార్జీలు చాలా ఎక్కువ. విమానయాన సంస్థల ఖర్చులో 50% కంటే ఎక్కువ ఇంధనానికి ఖర్చవుతోందని తెలుస్తోంది. ఏది ఏమైనా విమాన ఛార్జీలు తగ్గిస్తే ప్రయాణికులకు శుభవార్తే..!


Click it and Unblock the Notifications