అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంగళవారం (ఏప్రిల్ 14) స్టాక్ మార్కెట్లకు సెలవు దినం. ఫారెక్స్ మార్కెట్లు కూడా పని చేయవు. గత వారం లాభాలు చూసిన మార్కెట్లు సోమవారం మాత్రం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 470 పాయింట్లు నష్టపోయి 30,475 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు కోల్పోయి 8,993 వద్ద ముగిసింది. చమురు ధరలు పెరగడంతో విమానయాన, చమురు మార్కెటింగ్ కంపెనీల షేర్లు మిశ్రమంగా ముగిశాయి.

అన్ని రంగాలు నష్టాల్లోనే..
నిన్న మార్కెట్లో బ్యాంకింగ్ రంగ షేర్లు దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంకు 3.44 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 3.12 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 2.79 శాతం ఢీలా పడ్డాయి. ఈ ఏడాదిలో నిఫ్టీ బ్యాంకింగ్ దాదాపు 40 శాతం మేర నష్టపోయింది. రియల్, పైనాన్స్, ఆటో, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ రంగాలు కూడా దాదాపు 4 శాతం నుండి 5 శాతం మేర నష్టపోయాయి. టెలికం, మెటల్ షేర్లు మాత్రమే రాణించాయి.

ఇతర దేశాల మార్కెట్ల కంటే పడిపోయిన భారత మార్కెట్
కరోనా కేసులు, మృతుల సంఖ్య భారత్‌లో చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ ఇన్వెస్టర్ సెంటిమెంట్ మాత్రం మిగతా దేశాలతో పోలిస్తే ఏమాత్రం బలంగా లేదని అంటున్నారు. ఇందుకు వివిధ కారణాలు చూపిస్తున్నారు. ఫిబ్రవరి 1 నుండి ఏప్రిల్ 9 మధ్య భారత స్టాక్ మార్కెట్ డాలర్ మారకంలో 26 శాతం నష్టపోయింది. అదే సమయంలో అమెరికా, యూరోప్ మార్కెట్లు వరుసగా 14 శాతం, 20 శాతం నష్టపోయాయి. వర్ధమాన మార్కెట్లు 15 శాతం క్షీణించాయి.

చైనాలో కేవలం 3 శాతమే
కరోనా ఉద్భవించిన చైనాలో మార్కెట్ ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ మధ్య 3 శాతం నష్టపోయింది. అంటే ప్రపంచదేశాల మార్కెట్లు ఈ మధ్య కాలంలో నష్టపోయింది 3 శాతం నుండి 15 లేదా 20 శాతం మధ్య. కానీ భారత మార్కెట్ మాత్రం 25 శాతానికి పైగా నష్టపోయిందని గుర్తు చేస్తున్నారు. మార్కెట్ పరంగా అతి తక్కువ దెబ్బతిన్నది కూడా చైనా కావడం గమనార్హం.

భారత ఆర్థిక వ్యవస్థపై పెను భారం
మూడు వారాల లాక్ డౌన్ నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థపై రూ.7 లక్షల నుండి రూ.8 లక్షల ప్రభావం పడుతుందని అంచనా వేస్తున్నారు. మరింత పొడిగిస్తే మరింత నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏం చెబుతారనే ఆసక్తి ఇప్పుడు అందరిలోను నెలకొంది. దేశాన్ని మూడు జోన్లుగా విభజించి.. ఆ పరంగా చర్యలుతీసుకోవచ్చునని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications