rupee trading: G-20 దేశాల సమావేశాలకు ఈసారి ఇండియా అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ అవకాశాన్ని వినియోగించుకుని పలు విషయాలను చక్కబెట్టుకోవాలని భారత్ ప్లాన్ చేస్తోంది. పేద దేశాల రుణ విముక్తి కోసం చొరవ తీసుకుని, వాటి రీస్ట్రక్చరింగ్ కోసం విదేశాలను ఇటీవల ఒప్పించింది. తాజాగా మరో పెద్దపని పూర్తిచేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుత G-20 సమ్మిట్ లో రూపీ వాణిజ్యాన్ని భారత్ ప్రమోట్ చేయనున్నట్లు ఓ సీనియర్ అధికారి చెప్పారని ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. ఇందుకోసం ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. వాణిజ్య పరంగా ఇబ్బంది పడుతూ, సమస్యలు ఎదుర్కొంటున్న వివిధ దేశాలు.. రూపాయితో చెల్లింపులు జరపాలని కోరుతున్నట్లు పేర్కొంది.

త్వరలో జరగనున్న G-20 వాణిజ్య, పెట్టుబడి సమావేశాన్ని.. రూపీ వాణిజ్యాన్ని ప్రమోట్ చేసేందుకు సాధనంగా వినియోగించుకోవాలని ఇండియా చూస్తుందా అనే ప్రశ్నకు ఆ అధికారి పై విధంగా సమాధానం ఇచ్చారు. ఇది కేవలం G-20కి సంబంధించిన అంశం మాత్రమే కాదన్నారు. రూపాయి వాణిజ్యం ఎజెండాను ముందుకు తెచ్చే అంశం.. కేవలం G-20 సమ్మిట్ సమావేశంలో భాగం కాదని, అవకాశమున్న ప్రతిచోటా ప్రస్తావన తెస్తామన్నట్లు అధికారి పేర్కొన్నారు.

గతేడాది నుంచి నెలకొన్న కరెన్సీ అస్థిరత వల్ల వాణిజ్య పరంగా చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాటిని ఎదుర్కొంటూ, అవసరాలను తీర్చుకోవడానికి రూపాయితో కొత్త చెల్లింపు విధానాన్ని ఇండియా ప్రపోజ్ చేసింది. ఇందుకోసం ఇప్పటి వరకు 18 దేశాలతో ఒప్పందం సైతం కుదుర్చుకుంది. మంగళవారం నుంచి G-20 సమావేశాలు జరుగుతున్నాయి. ఈ గ్రూపులోని దేశాలతో పాటు కొన్ని ప్రత్యేక ఆహ్వానిత దేశాలు, అంతర్జాతీయ సంస్థల నుంచి సుమారు 100 మంది ప్రతినిధులు దీనికి హాజరుకానున్నారు.


Click it and Unblock the Notifications