రోడ్డుపై ట్రాఫిక్ జామ్‌లకు బైబై! ఇకపై నీళ్లపైనే మెట్రో ప్రయాణం.. ఏయే సిటీల్లో అంటే..
మన దేశంలో ఎక్కడికి వెళ్లాలన్నా ట్రాఫిక్ పెద్ద తలనొప్పిగా మారింది కదా? ఆఫీస్‌కి వెళ్లాలన్నా, టూరిస్ట్ ప్లేస్‌లకు వెళ్లాలన్నా గంటల తరబడి రోడ్ల మీద నరకం చూడాల్సి వస్తోంది. కానీ, ఇకపై ఆ బాధలు చాలా వరకు తప్పనున్నాయి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే ప్లాన్ చేస్తోంది. కేరళలోని కొచ్చిలో సూపర్ సక్సెస్ అయిన వాటర్ మెట్రో (water metro) మోడల్‌ను ఇప్పుడు దేశవ్యాప్తంగా మరో 18 నగరాల్లో తీసుకురావడానికి రెడీ అవుతోంది.
కేంద్ర ఓడరేవులు, రవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లో ఈ విషయాలను అధికారికంగా వెల్లడించారు. దీనికోసం ప్రత్యేకంగా 'నేషనల్ వాటర్ మెట్రో పాలసీ 2026' డ్రాఫ్ట్‌ను కూడా సిద్ధం చేశారు.

మొదటి లిస్ట్‌లో ఏయే నగరాలు ఉన్నాయి?
ఈ సరికొత్త వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను రెండు, మూడు ఫేజ్‌లలో తీసుకురానున్నారు. మొదటి ఫేజ్‌లోనే మన దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక, చారిత్రక నగరాలను ఎంపిక చేశారు. ఇందులో ముఖ్యంగా:
- శ్రీనగర్
- పాట్నా
- వారణాసి
- అయోధ్య
- ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)
ఈ నగరాల్లో ప్రాజెక్ట్ మొదలైన తర్వాత, అస్సాంలోని తేజ్‌పూర్, దిబ్రూగఢ్ వంటి ప్రాంతాల్లో తర్వాతి ఫేజ్‌లో పనులు మొదలుపెడతారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వేలు పూర్తయ్యాయి.
అసలు ఏంటి ఈ 'వాటర్ మెట్రో' స్పెషాలిటీ?
చాలామందికి ఒక డౌట్ రావచ్చు.. మామూలు బోట్లకు, ఈ వాటర్ మెట్రోకు తేడా ఏంటి అని? ఇవి మామూలు పడవలు కావు. పూర్తిగా అత్యాధునిక టెక్నాలజీతో నడిచే ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ బోట్లు. మెట్రో ట్రైన్ లోపల ఎలాంటి ఏసీ, సీటింగ్ సదుపాయాలు ఉంటాయో, ఇందులోనూ సరిగ్గా అలాగే ఉంటాయి. జెట్టీలు, ప్యాసింజర్ టెర్మినల్స్, ఛార్జింగ్ పాయింట్లు అన్నీ చాలా హైటెక్‌గా డిజైన్ చేస్తారు.
దీనివల్ల కేవలం ట్రాఫిక్ తగ్గడమే కాదు.. పర్యావరణానికి కూడా చాలా మేలు జరుగుతుంది. పెట్రోల్, డీజిల్ ఖర్చు భారీగా తగ్గుతుంది. అంతేకాదు, నగరాల్లో వరదలు వచ్చినప్పుడు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినా, ఈ water metro సేవలు మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా సాగుతాయి.
మన సంస్కృతి ఉట్టిపడేలా టెర్మినల్స్!
ఈ ప్రాజెక్ట్ గురించి కేంద్ర మంత్రి సోనోవాల్ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. ఈ మెట్రో స్టేషన్లు (టెర్మినల్స్) కేవలం ఆధునికంగానే కాకుండా, ఆయా నగరాల చరిత్రను, భారతదేశ సముద్రయాన వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆదేశించారు. స్థానికంగా దొరికే మెటీరియల్స్ ఉపయోగించి, అక్కడి సంస్కృతి తెలిసేలా వీటిని నిర్మిస్తారట.
ఇప్పటికే 17 నగరాలకు సంబంధించిన ఫీజిబిలిటీ రిపోర్ట్స్ (అంటే అక్కడ ప్రాజెక్ట్ చేయడం సాధ్యమేనా కాదా అనే నివేదికలు) ప్రభుత్వానికి అందాయి. లక్ష్ద్వీప్ రిపోర్ట్ ఒక్కటే పెండింగ్‌లో ఉంది. సో, త్వరలోనే మనకు నీళ్లపై తేలియాడే మెట్రో రైళ్లు దర్శనమివ్వడం ఖాయం! మీరేమంటారు? ఈ ప్రాజెక్ట్ మన తెలుగు రాష్ట్రాల్లోని నగరాలకు కూడా వస్తే బాగుంటుంది కదా!


Click it and Unblock the Notifications