భారత్ ఎప్పటికీ చైనాను చేరుకోలేదు.. సంచలన కారణాలు చెప్పిన ఆర్థిక నిపుణులు రుచిర్ శర్మ
India vs China Growth: భారతదేశం రాబోయే కాలంలో చైనాను అధిగమించగలదా? ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఫండ్ మేనేజర్ రుచిర్ శర్మ.. రాజ్ షమానీతో పాడ్‌కాస్ట్ తో ఇంటర్వ్యూలో చెప్పిన వివరాల ప్రకారం.. ఇది బహుశా సాధ్యంకాదని చెప్పాలి. ఆయన విశ్లేషణలో భారతదేశం చైనా లాగా రెండంకెల వృద్ధి రేటుతో ఎప్పుడూ అభివృద్ధి చెందదు. దీని వెనుక అనేక ప్రాథమిక కారణాలు ఉన్నాయని రుచిర్ శర్మ నొక్కి చెప్పారు. ఒక ప్రధాన కారణంగా ఉచితాల సంస్కృతిని ఆయన తెలిపారు.
చైనా ఎప్పుడూ ప్రజలకు ఉచిత వస్తువులు ఇవ్వలేదు. ప్రజలకు పని చేయాల్సిన ప్రదేశాన్ని స్వయంగా ఎన్నుకోవడానికి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి మాత్రమే ప్రోత్సాహం ఇచ్చింది. కానీ భారతదేశంలో ప్రభుత్వం తరచుగా ఉచిత లాభాలు, అనేక పథకాలు అందిస్తోంది. దీనివల్ల ప్రజలకు పనిచేయాలనే ఉత్సాహం తగ్గిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక మరో ముఖ్య అంశంగా ప్రభుత్వ సంస్థలను ఆయన గుర్తించారు. చైనా దేశం 1990లలో తన నష్టపోతున్న ప్రభుత్వ కంపెనీలను ప్రైవేట్ సంస్థలకు అమ్మడం ద్వారా ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా మార్చుకుంది. అయితే భారతదేశంలో ఇలాంటి మార్పులు సులభంగా జరగడం లేదు. ఎందుకంటే రాజకీయ, సామాజిక ఒత్తిడులు కారణంగా నష్టపోతున్న సంస్థలను ప్రైవేటీకరించడంలో అవరోధాలు ఎదురవుతున్నాయి. అందుకే ఈ మార్గంలో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు.
తలసరి ఆదాయం పరంగా కూడా రెండు దేశాల మధ్య భారీ తేడా ఉందని రుచిర్ శర్మ చెప్పారు. భారతదేశం తలసరి ఆదాయం సుమారు 3 వేల డాలర్లు మాత్రమే ఉండగా, చైనాకి 10 వేల డాలర్లకి పైగానే ఉంది. మరో పదేళ్లలో భారత వృద్ధి రేటు 6-7 శాతం మధ్య ఉండి, చైనా వృద్ధి రేటు 2-3 శాతంకి తగ్గిపోవచ్చని ఆయన అంచనా వేశారు. భారతదేశం చైనాను అధిగమించడానికి కనీసం 20 సంవత్సరాలు పడతుందని తెలిపారు.
రుచిర్ శర్మ అభిప్రాయపడిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. రాజకీయ నాయకత్వం. సంక్షోభ సమయంలో దేశానికి కొత్త, సుసంపన్నమైన నాయకులు రావడం ద్వారా పెద్ద సంస్కరణలు జరుగుతాయని ఆయన హైలెట్ చేశారు. ఇంకా జనాభా వృద్ధి కూడా కీలకమని తెలిపారు. జనాభా తగ్గుతున్న దేశాలు వేగంగా అభివృద్ధి చెందలేవని చెప్పారు.ఇక కరెన్సీ విషయానికొస్తే, బలమైన కరెన్సీ కాదు చౌకైన కరెన్సీ మెరుగైన ఆర్థిక వృద్ధికి దోహదపడతుందని ఆయన తెలిపారు. చౌకైన కరెన్సీ ఎగుమతులు పెంచుతుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుందని తెలిపారు.


Click it and Unblock the Notifications