అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ మీద 50 శాతం సుంకాలు విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం (UNGA) సందర్భంగా సెప్టెంబర్ చివరి వారంలో భారత ప్రధాని మోదీ యుఎస్ వెళ్లనున్నారు. వాణిజ్య ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో జరగబోయే సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.
ప్రస్తుతం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై వాణిజ్య చర్చలు కొనసాగుతున్నప్పటికీ సత్ఫలితాలు ఇవ్వడం లేదు. అమెరికా నుంచి వస్తున్న ఒత్తిడికి భారత్ ఎంత మాత్రం తలొగ్గడం లేదు. వ్యవసాయ రంగంలోకి అమెరికా ప్రవేశం కల్పించాలనే డిమాండ్ ని పూర్తిగా వ్యతిరేకిస్తోంది. రైతులు, మత్స్యకారులు, పశువుల పెంపకందారుల ప్రయోజనాలను కాపాడుకునేందుకు ఎందాకైనా వెళతామని స్పష్టం చేస్తోంది. జాతీయ ప్రయోజనాల కోసం నేను ఎంతటి వ్యక్తిగత ధర చెల్లించాల్సి వచ్చినా వెనుకడుగు వేయను అని ప్రధాని మోదీ ఇటీవల్ల తెలిపిన విషయం కూడా విదితమే.

రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చల్లో ఉక్కు పరిశ్రమ, ఇ-కామర్స్ సుంకాలు, వాతావరణ విధానాలు వంటి అనేక అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. రష్యన్ చమురు కొనుగోలుతో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్నారంటూ భారత్ మీద ట్రంప్ మండిపడుతున్నారు. ఇందులో భాగంగానే భారత దిగుమతులపై 25 శాతం సుంకం, అదనంగా 25 శాతం జరిమానా విధించనున్నట్లు ప్రకటించారు. ఈ కొత్త సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలులోకి రానున్నాయి. యురేనియం, ఎరువుల దిగుమతుల విషయంలో తాము అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలను విస్మరిస్తోందని భారత్ గట్టిగానే బదులిస్తోంది.
ఇదిలా ఉంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన అమెరికా-రష్యా మధ్య జరగబోయే చర్చల ఫలితంపైన కూడా ఆధారపడి ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆగస్టు 15న అలాస్కాలో Donald trump, పుతిన్ భేటీ అయి ఉక్రెయిన్ యుద్ధంపై శాంతి ఒప్పందం సాధించేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారత్-అమెరికా మధ్య చర్చల దిశ కూడా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) పార్లమెంటరీ కమిటీకి ఇచ్చిన వివరణలో.. ఇటీవలి కాలంలో ఇరు దేశాలు న్యాయమైన, సమతుల్య, పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం కృషి చేస్తున్నాయని పేర్కొంది. అమెరికా ప్రతిపాదించిన 50 శాతం సుంకం రష్యన్ చమురు కొనుగోలుపై తప్పు అంచనాల ఆధారంగా ఉందని..ఇది ప్రపంచ ఇంధన మార్కెట్ వాస్తవాలను ప్రతిబింబించదని తెలిపింది. అలాగే భారత సార్వభౌమ నిర్ణయాలను అమెరికా గౌరవించడం లేదని స్పష్టం చేసింది.
భారతదేశం ఎప్పుడూ మూడవ దేశాలపై ఏకపక్ష శిక్షాత్మక చర్యలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. ఈ విధానాలు విశ్వాసాన్ని దెబ్బతీసి, ప్రపంచ వాణిజ్య నియమాలను వక్రీకరిస్తాయని MEA ఘాటుగా వ్యాఖ్యానించింది. అన్ని రకాల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించేందుకు, పరస్పర గౌరవాన్ని కొనసాగించేందుకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది.


Click it and Unblock the Notifications