Trade deal: ట్రంప్ షాకింగ్ ప్రకటన.. రష్యా ఆయిల్ విషయంలో భారత్ వెనక్కి తగ్గిందా? అసలు నిజం ఇదీ!
గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య పరమైన ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం భారత్ రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తున్న అమెరికాకు.. భారత్ రష్యా నుండి ఆయిల్ కొనడం అస్సలు నచ్చలేదు. రష్యా వార్ మెషీన్‌కు భారత్ పరోక్షంగా సహకరిస్తోందని ట్రంప్ గతంలో తీవ్ర విమర్శలు కూడా చేశారు.
అంతేకాకుండా రష్యా ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు ప్రతికారంగా భారత ఉత్పత్తులపై ట్రంప్ అదనంగా 25% పన్నులు విధించారు. దీంతో మొత్తం టారిఫ్ 50 శాతానికి చేరి భారత ఎగుమతిదారులను ఉక్కిరిబిక్కిరి చేసింది.

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!
సోమవారం రాత్రి ఈ ట్రేడ్ డీల్ (Trade deal) గురించి ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఒక సంచలన ప్రకటన చేశారు. "భారత్ ఇకపై రష్యా నుండి ఆయిల్ కొనబోమని అంగీకరించింది. దానికి బదులుగా అమెరికా లేదా వెనిజులా నుండి చమురును కొనుగోలు చేస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. మోదీ కోరిక మేరకే తాను పన్నులను 18 శాతానికి తగ్గించానని, దీనివల్ల ఉక్రెయిన్ యుద్ధం ముగియడానికి సహాయపడుతుందని ట్రంప్ తెలిపారు.
అయితే ప్రధాని మోదీ తన సోషల్ మీడియా పోస్ట్‌లో మాత్రం కేవలం టారిఫ్ 18 శాతానికి తగ్గడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రష్యా ఆయిల్ కొనుగోలు ఆపేస్తున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదు. భారత వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా, ఇప్పటికీ భారత్ తన చమురు అవసరాలలో 35% రష్యా నుండే పొందుతోంది. మరి ట్రంప్ చెప్పినట్లు భారత్ తన నిర్ణయాన్ని మార్చుకుందా? లేదా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.
స్టీల్, అల్యూమినియం రంగాలకు ఊరట ఎప్పుడు?
ఈ ఒప్పందం వల్ల కొన్ని రంగాలకు మేలు జరిగినప్పటికీ, స్టీల్, అల్యూమినియం ఎగుమతిదారులకు మాత్రం ఇంకా కష్టాలు తీరలేదు. సెక్షన్ 232 కింద విధించిన డ్యూటీలు ఈ కొత్త డీల్‌లో పూర్తిగా తొలగించబడలేదు. దీనివల్ల ఈ రంగాలు ఇప్పటికీ 25-50% వరకు అధిక పన్నులను ఎదుర్కోవాల్సి రావచ్చు. మరోవైపు అమెరికా నుండి వ్యవసాయ ఉత్పత్తులను.. ముఖ్యంగా డైరీ , ఫామ్ ఉత్పత్తులను భారత్‌లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. మన దేశీయ రైతుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది చూడాలి.
భారత్ ఇప్పటికే అమెరికా నుండి చమురు దిగుమతులను 10 శాతానికి పెంచింది. అలాగే అణు ఇంధన రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యానికి 'శాంతి' (SHANTI) బిల్లు ద్వారా పచ్చజెండా ఊపింది. ఈ మార్పులు అమెరికాను సంతృప్తి పరచడానికి చేసినవే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ ట్రేడ్ డీల్ (Trade deal) వల్ల రూపాయి విలువ పెరగడం, ఆర్థిక మార్కెట్లు పుంజుకోవడం సానుకూల అంశం. కానీ రష్యా ఆయిల్ విషయంలో భారత అధికారిక ప్రకటన వెలువడితేనే ఈ డీల్ పూర్తి వివరాలు మనకు తెలుస్తాయి.


Click it and Unblock the Notifications