భారతదేశ వాణిజ్య రంగంలో ఇప్పుడు 'ట్రేడ్ డీల్' (Trade Deal) అంశం సెగలు పుట్టిస్తోంది. భారత్ అమెరికా మధ్య కుదురుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై రైతు సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఒప్పందం భారతీయ రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని సంయుక్త కిసాన్ మోర్చా (SKM) మండిపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు.

ఒప్పందంపై రైతుల ఆందోళన ఏంటి?
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో కుదుర్చుకుంటున్న ఈ ఒప్పందం వల్ల ముఖ్యంగా పత్తి, యాపిల్, పాడి రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతుందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో యాపిల్ సాగుపై ఆధారపడ్డ లక్షలాది కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని యాపిల్ ఫార్మర్స్ ఫెడరేషన్ నేత తరిగామి హెచ్చరించారు. మార్కెటింగ్ సదుపాయాలు లేక ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్న తమపై, అమెరికా దిగుమతుల భారం వేయడం సరికాదని ఆయన పేర్కొన్నారు.
పత్తి, పాడి రంగాలపై ప్రభావం
మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో పత్తి పండించే రైతులకు ఈ 'ట్రేడ్ డీల్' శాపంగా మారే అవకాశం ఉంది. విదేశీ పత్తిపై సుంకాలు తగ్గించడం వల్ల దేశీయంగా పత్తి ధరలు పడిపోయే ప్రమాదం ఉందని రైతు నేతలు వాపోతున్నారు.
అంతేకాకుండా ఈ ఒప్పందంలో జంతువుల మేత (Animal Feed) దిగుమతి అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "అమెరికా నుంచి దిగుమతి అయ్యే పశుగ్రాసంలో మాంసాహార అవశేషాలు ఉండే అవకాశం ఉంది. మన ఆవులకు అపవిత్రమైన ఆహారాన్ని పెట్టాలని ప్రభుత్వం చూస్తోందా?" అని రైతు నేత రాకేష్ టికాయిత్ ప్రశ్నించారు. ఇది మన సంప్రదాయాలకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు.
పీయూష్ గోయల్ అబద్ధం చెబుతున్నారా?
వ్యవసాయం, పాడి పరిశ్రమలను ఈ ఒప్పందం నుంచి మినహాయించామని మంత్రి పీయూష్ గోయల్ చెబుతున్న మాటలు వాస్తవం కాదని SKM నేతలు ఆరోపిస్తున్నారు. బ్రిటన్, న్యూజిలాండ్ వంటి దేశాలతో జరిగిన ఒప్పందాల్లో కూడా పాడి ఉత్పత్తులు ఉన్నాయని, మంత్రి దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అమెరికా వస్తువులపై 30% నుంచి 150% వరకు ఉన్న ట్యాక్స్‌ను ఇప్పుడు సున్నాకు తగ్గించారని, అదే సమయంలో భారతీయ వస్తువులపై అమెరికా ట్యాక్స్‌లు పెంచిందని వారు గణాంకాలతో వివరించారు.
ఫిబ్రవరి 12న భారీ నిరసనలు
ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని, లేదంటే దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఫిబ్రవరి 12న కార్మికుల సమ్మెకు మద్దతుగా రైతులు కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ఈ ఒప్పందంపై సంతకం చేయకూడదని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications