చమురు ధరలు పెరిగినా పెట్రోల్, డిజీల్ ధరలు పెరగవు.. సామాన్యులకు కేంద్రం గుడ్ న్యూస్..
ఇటీవల కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర ఒక్కో బ్యారెల్‌కు దాదాపు 80 డాలర్ల స్థాయికి చేరుకుంది. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా ప్రాంతాల్లో నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధ భయాలు, సరఫరా అంతరాయాల కారణంగా ఈ ధరల పెరుగుదల చోటు చేసుకుంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా దేశాల్లో ఇంధన ధరలు వెంటనే పెరుగుతుంటాయి.
ఇక భారతదేశం ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగితే, దిగుమతి ఖర్చు కూడా పెరుగుతుంది. దీని ప్రభావం సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో ప్రజలపై పడుతుంది. అయితే తాజా పరిస్థితుల్లో భారత్‌లో మాత్రం తక్షణంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం తక్కువగా ఉందని ప్రభుత్వ వర్గాలు,ఇంధన రంగ నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భారతదేశంలో Petrol, డీజిల్ ధరలు 2022 ఏప్రిల్ నుంచి దాదాపు స్థిరంగానే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఎప్పటికప్పుడు మారుతున్నా.. దేశీయంగా వినియోగదారులపై ఆ భారాన్ని వెంటనే మోపడం లేదు. ఇది ప్రభుత్వం, ఇంధన కంపెనీలు తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాల ఫలితం.
భారతదేశంలోని ప్రధాన ప్రభుత్వ రంగ ఇంధన సంస్థలైన..ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియంలు గతంలో చమురు ధరలు తక్కువగా ఉన్న సమయంలో మంచి లాభాలను ఆర్జించాయి. ఆ లాభాలను ఇప్పుడు ఉపయోగించి, ప్రస్తుత చమురు ధరల పెరుగుదల ప్రభావాన్ని తమ స్థాయిలోనే భరించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని వల్ల సామాన్య వినియోగదారులపై వెంటనే భారం పడటం లేదు.
ఇంధన ధరలు పెరిగితే దాని ప్రభావం నేరుగా ద్రవ్యోల్బణంపై పడుతుంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంధన ధరల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా సామాన్య ప్రజలపై అదనపు భారం పడకూడదనే ఉద్దేశంతో, ప్రస్తుతం పెట్రోల్-డీజిల్ ధరలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం లేదని సమాచారం.రాజకీయ, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలనే వ్యూహం కూడా ఇందులో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
అయితే దీర్ఘకాలంలో పరిస్థితి పూర్తిగా గ్లోబల్ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. మధ్యప్రాచ్యం వంటి కీలక చమురు ఉత్పత్తి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగితే, చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడితే, ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. అప్పుడు భారత ప్రభుత్వం, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఏదేమైనా ప్రస్తుతం మాత్రం భారత వినియోగదారులకు ఊరట కలిగే పరిస్థితి కనిపిస్తోంది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు పెరిగినా, దేశీయంగా పెట్రోల్-డీజిల్ ధరలు తక్షణం పెరగకపోవడం సామాన్య ప్రజలకు మంచి వార్తగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications