Indian Economy: బ్రిటన్‌ను వెనక్కి నెట్టిన భారత్.. ప్రపంచంలో సరికొత్త రికార్డ్.. దూకుడుగా 5వ స్థానానికి..
Indian Economy: కాలం ఎల్లప్పుడూ ఒక్కరి పక్షానే ఉండదని మరోసారి రుజువైంది. తన సామ్రాజ్యవాదంలో భారత వనరులను ఏకంగా 200 సంవత్సరాల పాటు కొల్లగొట్టిన బ్రిటన్ ఆర్థికంగా నేడు వెనకబడింది. ప్రపంచంలో బలమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ యూకేను వెనక్కు నెట్టింది. దీనిపై యావత్ భారత్ తో పాటు వ్యాపారవేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

2008 ఆర్థిక మాంద్యం..
అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2008లో వచ్చిన ఆర్థిక మాంద్యం అనేక దేశాలను అతలాకుతలం చేసింది. దాని తరువాత మళ్లీ కరోనా కారణంగా ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మళ్లీ మందగించాయి. వీటికి తోడు కోలుకుంటున్న సమయంలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం ఊపందుకుంది. సరఫరా వ్యవస్థలు స్తంభించటం, ఇబ్బందులకుగురికావటం వల్ల ఉత్పాదకత మళ్లీ దెబ్బతింది.

అగ్రదేశాల్లో భారీ మార్పు..
కరోనా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అగ్రరాజ్యాలుగా పరిగణించబడే టాప్- 10 దేశాల్లో భారీ మార్పు వచ్చింది. అయితే.. రష్యాకు మిత్రదేశంగా ఉన్న భారత్ సహా పలు దేశాలు మాత్రం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతున్నాయి. దీంతో ప్రపంచంలోని టాప్- 10 ఆర్థిక దేశాల జాబితాలో 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ ఇప్పుడు 6వ స్థానానికి పడిపోయింది. యూకేను వెనక్కునెట్టి భారత్ ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది.

బ్రిటన్..
బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థ, వ్యాపారం అధ్వాన్న స్థితిలో ఉంది. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల కారణంగా 5వ స్థానంలో ఉన్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ 6వ స్థానానికి దిగజారింది. అక్కడి ప్రభుత్వం నుంచి చాలా మంది మంత్రులు రాజీనామా చేశారు. కొత్త ప్రధాన మంత్రి ఎవరు అనే రేసులో లిజ్ ట్రస్ ముందంజలో ఉండగా.. బ్రిటీష్ భారతీయుడైన రిషి సునక్ వెనుకన ఉన్నారు.
ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సెప్టెంబర్ 3న భారత్ ఆర్థికంగా UKని అధిగమించి 5వ అతిపెద్ద వ్యవస్థగా అవతరించటాన్ని ప్రశంశించారు. దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు పోరాడిన, త్యాగం చేసిన ప్రతి భారతీయుడి గుండెల్లో ఈ వార్త నిండి ఉంటుందని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం కోసం ఎంతో కష్టపడి పోరాడి త్యాగం చేసిన ప్రతి భారతీయుడి హృదయాలను నింపే వార్త అన్నారు. లా ఆఫ్ కర్మ అంటే ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. అనేక మంది నెటిజన్లు మహీంద్రా అభిప్రాయంతో ఏకీభవిస్తూ ప్రశంశిస్తున్నారు.

భారత్ పరిస్థితి..
IMF విడుదల చేసిన డేటా ఆధారంగా.. రష్యా నుండి ముడి చమురు తగ్గింపు ధర కారణంగా మొదటి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతోంది. ఫలితంగా భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. US మొదటి స్థానంలో ఉండగా.. చైనా రెండవ స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, జర్మనీ, భారత్, బ్రిటన్ ఉన్నాయి. త్వరలోనే జర్మనీని భారత్ అధిగమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


Click it and Unblock the Notifications