దేశంలో అత్యంత ధనిక, పేద రాష్ట్రాల లిస్టు ఇదిగో.. తెలుగు రాష్ట్రాల సంగతి ఏంటంటే..
India State Rankings FY25: అంతర్జాతీయ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి ప్రతికూల పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్నప్పటికీ ఈ ఏడాది భారత్ సత్తా చాటింది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియా అద్భతమైన ప్రదర్శనను కనబరిచింది. వరుసగా నాలుగో ఏడాది ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వాస్తవ జిడిపి 7.4 శాతం వృద్ధి సాధించనుంది. ఇది గత ఆర్థిక సంవత్సరంలో నమోదైన 6.5 శాతం వృద్ధితో పోలిస్తే గణనీయమైన పురోగతిగా భావిస్తున్నారు.
అంతేకాకుండా అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ తన 2026 వృద్ధి అంచనాలను 0.7 శాతం పాయింట్లు పెంచి 7.3 శాతానికి సవరించింది. దీని ఫలితంగా భారత్ జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఈ జాతీయ వృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (GSDP) పరంగా కొన్ని రాష్ట్రాలు దేశ ఆర్థిక ఇంజిన్‌లుగా నిలుస్తున్నాయి.

2025 ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్ర మరోసారి దేశంలోనే అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థగా నిలిచింది. భారతదేశ ఆర్థిక రాజధాని ముంబైకి నిలయమైన ఈ రాష్ట్రం.. ఆర్బీఐ హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రస్తుత ధరల వద్ద రూ. 45.32 లక్షల కోట్ల GSDP (Gross State Domestic Product (స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి)ను నమోదు చేసింది. ఇది దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే చాలా ముందంజలో ఉంది.
ఇక రెండో స్థానంలో తమిళనాడు నిలిచింది. ఈ రాష్ట్రం రూ. 31.19 లక్షల కోట్ల GSDPతో బలమైన పారిశ్రామిక, తయారీ రంగ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. మూడో స్థానంలో ఉత్తర ప్రదేశ్ నిలిచింది. రూ. 29.78 లక్షల కోట్ల GSDPతో ఈ రాష్ట్రం ఈ ఏడాది కర్ణాటకను అధిగమించి మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది ఉత్తరప్రదేశ్‌లో పెరుగుతున్న మౌలిక వసతులు, పెట్టుబడులు, సేవల రంగ విస్తరణకు నిదర్శనంగా భావిస్తున్నారు.రూ. 28.84 లక్షల కోట్ల GSDPతో కర్ణాటక నాల్గవ స్థానంలో ఉంది.
ఐదో స్థానంలో వెస్ట్ బెంగాల్ రూ. 18.15 లక్షల కోట్లతో నిలవగా.. ఆరవ స్థానంలో రాజస్థాన్ రూ. 17.04 లక్షల కోట్ల GSDPతో ఉంది. ఏడో స్థానంలో ఉన్న తెలంగాణ రూ. 16.41 లక్షల కోట్ల GSDPను నమోదు చేసి, టెక్నాలజీ, సేవల రంగాల్లో తన బలాన్ని కొనసాగిస్తోంది. ఇక ఎనిమిదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ రూ. 15.93 లక్షల కోట్లతో నిలిచింది. వ్యవసాయం, పోర్ట్ ఆధారిత అభివృద్ధి, పరిశ్రమల వల్ల రాష్ట్ర ఆర్థిక పరిమాణం ఈ రాష్ట్రంలో స్థిరంగా పెరుగుతోంది. తొమ్మిదో స్థానంలో మధ్య ప్రదేశ్ రూ. 15.03 లక్షల కోట్లతో ఉండగా పదో స్థానంలో ఢిల్లీ రూ. 12.15 లక్షల కోట్ల GSDPతో ఈ జాబితాలో నిలిచింది.
ఇక అట్టడుగు స్థానాల్లో చిన్న ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అరుణాచల ప్రదేశ్ సుమారు రూ. 44,228 కోట్ల GSDPతో అత్యల్ప ఆర్థిక పరిమాణం కలిగిన రాష్ట్రంగా నిలిచింది. అలాగే పాండిచ్చేరి, మేఘాలయ కూడా తక్కువ GSDPతో జాబితా చివర్లో ఉన్నాయి. క్లుప్తంగా చూస్తే.. 2025 ఆర్థిక సంవత్సరం భారతదేశానికి మాత్రమే కాకుండా రాష్ట్రాలకూ కీలకమైన సంవత్సరంగామారింది. పెద్ద రాష్ట్రాలు తమ ఆర్థిక బలాన్ని మరింత పటిష్టం చేసుకుంటుండగా, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు వేగంగా ఎదుగుతున్నాయి.
Data Source: RBI Handbook of Statistics on Indian States


Click it and Unblock the Notifications