Aadhar: మూడీస్ ఆరోపణలపై భారత్ క్లారిటీ.. వరల్డ్ బ్యాంక్ నివేదికతో కౌంటర్ అటాక్
Aadhar: మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన సొంత అభిప్రాయాలతో ఆధార్ పై నివేదిక తయారు చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఎటువంటి ఆధారాలు, నివేదికలు లేకుండా రూపొందించిన ఈ రిపోర్ట్ 'బేస్ లెస్' అంటూ ఎలక్ట్రానిక్స్ & IT మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. బిలియన్ మంది భారతీయులు ఆధార్ పై పూర్తి నమ్మకంతో 100 బిలియన్ల కంటే ఎక్కువ సార్లు తమను తాము ధ్రువీకరించుకున్నట్లు ప్రకటించింది.
ఆధార్ అనేది భారత డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (DPI)కు పునాది అని IT శాఖ తన ప్రెస్ నోట్ లో స్పష్టం చేసింది. 'ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయమైన డిజిటల్ ID అయిన ఆధార్ కు వ్యతిరేకంగా ఓ ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ విస్తృతమైన ఆరోపణలు చేయడం సరికాదు' అని పేర్కొంది.

'UIDAI వెబ్ సైట్ లో సమాచారం ఆధారంగా నివేదిక రూపొందించినట్లు ఇన్వెస్టర్స్ సర్వీస్ సంస్థ చెప్పుకొచ్చింది. అయితే జారీ చేసిన ఆధార్ ల సంఖ్య వెబ్ సైట్ లో సరిగానే 1.2 బిలియన్లు అని పేర్కొన్నప్పటికీ ఆ సంస్థ మాత్రం తప్పుగా నివేదించింది. MGNREGS పథకంలో ఆధార్ సీడింగ్ పై
చేసిన వాదనలు కూడా సరికాదు. ఎందుకంటే ఆధార్ ధ్రువీకరణతో సంబంధం లేకుండా చెల్లింపులు జరుగుతున్నాయి' అని తేల్చి చెప్పింది.
ఆధార్ ధ్రువీకరణకు కేవలం బయోమెట్రిక్ మాత్రమే మార్గం కాదని కేంద్రం తెలిపింది. ఫేస్ అథెంటికేషన్, ఐరిస్ వంటి ఇతర మార్గాలూ ఉన్నట్లు గుర్తుచేసింది. ఇందుకు అదనంగా మొబైల్ OTP ఆప్షన్ కూడా చాలా సందర్భాల్లో అందుబాటులో ఉన్నట్లు చెప్పింది. ఈరోజు వరకు ఆధార్ డేటాబేస్ నుంచి ఎటువంటి సమాచార ఉల్లంఘన నివేదించబడలేదని ఇప్పటికే పార్లమెంటులో స్పష్టం చేసినట్లు వెల్లడించింది.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్ కోసం ISO 27001:2013, ప్రైవసీ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ కోసం ISO 27701:2019 వంటి అంతర్జాతీయ భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవల G20 గ్లోబల్ పార్టనర్‌షిప్ ఫర్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ (GPFI), గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రిపోజిటరీ (GDPIR)తో పాటు ప్రపంచ బ్యాంకు సైతం ఆధార్ అథెంటిఫికేషన్ ను కొనియాడినట్లు గుర్తుచేసింది.


Click it and Unblock the Notifications