WPI ద్రవ్యోల్భణం 1.48%: హోల్‌సేల్ ధరలు పెరిగితే రిటైల్‌పై ప్రభావం
భారత హోల్‌సేల్ ద్రవ్యోల్భణం వరుసగా మూడో నెల పెరిగింది. తయారీ రంగ వస్తువుల ధరలు పెరగడంతో హోల్‌సేల్ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్భణం అక్టోబర్ నెలలో 8 నెలల గరిష్టస్థాయి 1.48 శాతానికి చేరింది. సెప్టెంబర్ నెలలో ఇది 1.32 శాతంగా ఉంది. 2019 అక్టోబర్ నెలలో సున్నా శాతంగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన 2.26 శాతం తర్వాత హోల్‌సేల్ ద్రవ్యోల్భణం ఈ స్థాయికి (1.48 శాతం) చేరుకోవడం ఇదే మొదటిసారి. రిటైల్ ద్రవ్యోల్భణం ఇప్పటికే గరిష్టస్థాయిలో ఉంది. ద్రవ్యోల్భణం పెరిగినందున వచ్చే నెలలో ప్రకటించనున్న ద్రవ్య విధానంలో కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందని భావిస్తున్నారు.

తయారీ వస్తువుల ధరలు పెరగడంతో...
ఫిబ్రవరి తర్వాత WPI ద్రవ్యోల్భణం ఈస్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అక్టోబర్ ఆహార ద్రవ్యోల్బణం 6.37 శాతంగా (సెప్టెంబర్‌లో 8.17 శాతం) నమోదు కాగా కూరగాయల ధరలు 25.23 శాతం, తయారీ వస్తువుల ధరలు 2.12 శాతం పెరిగాయి. ఆహార ద్రవ్యోల్భణం సెప్టెంబర్‌లో 8.17 శాతం, అక్టోబర్ నెలలో 6.37 శాతం, ఆహారేతర ఉత్పత్తులు, ఖనిజాల ద్రవ్యోల్భణం వరుసగా 2.85 శాతం, 9.11 శాతం పెరిగాయి. తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్భణం సెప్టెంబర్ నెలలో 1.61 శాతంగా నమోదయింది.

ఏది ఎంత పెరిగిందంటే
మొత్తం సూచీలో ఆహార ఉత్పత్తుల వెయిటేజీ దాదాపు 12 శాతంగా ఉంది. కూరగాయల ధరలు 25.23 శాతం పెరిగితే, ఆలు ధరలు 107.70 శాతం పెరిగాయి. సూచీలో 12 శాతం వెయిటేజీ ఉన్న నాన్-ఫుడ్ ఆర్టికల్స్, మినరల్స్ ధరలు వరుసగా 2.85 శాతం, 9.11 శాతం ఎగిశాయి. సూచీలో 62 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరలు రెండు శాతానికి పైగా పెరగడం ప్రభావం చూపాయి. 14 శాతం వెయిటేజీ ఉన్న ఫ్యూయల్ అండ్ పవర్ ఇండెక్స్ అయితే 10.95 శాతం క్షీణించాయి.

రెపో రేటు తగ్గించకపోవచ్చు
ద్రవ్యోల్భణం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు లేవని భావిస్తున్నారు. ప్రస్తుతం రెపో 4 శాతంగా ఉంది. టోకు ధరలు ఎక్కువగా ఉంటే, రిటైల్ ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. రిటైల్ ద్రవ్యోల్భణం 2 శాతం నుండి 6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్ట్ నెలలో రిటైల్ ద్రవ్యోల్భణం 6.7 శాతంగా ఉండగా, సెప్టెంబర్ నెలలో 7.27 శాతానికి పెరిగింది. అక్టోబర్ నెలలో 7.61 శాతానికి పెరిగింది.


Click it and Unblock the Notifications