దేశంలో సెమీకండక్టర్ తయారీ సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. మంగళవారం కేంద్ర మంత్రివర్గ క్యాబినెట్ మొత్తం రూ. 4,594 కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా నాలుగు కొత్త సెమీకండక్టర్ తయారీ యూనిట్ల ఏర్పాటుకు కీలకమైన ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులు భారతదేశ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యాన్ని చేరుకోనున్నాయి. కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన ఈ ప్రాజెక్టులలో ఒడిశాలో రెండు ఫ్యాక్టరీలు, ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, పంజాబ్‌లో ఒకటి ఏర్పాటు చేయనున్నారు.
ఈ మేరకు ఈటీ కథనం ప్రచురించింది. ఈ కర్మాగారాలు అధునాతన చిప్ తయారీ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తన కథనంలో తెలిపింది. ఇవి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత.. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు మేడ్-ఇన్-ఇండియా Semiconductor లు సరఫరా చేయడం ప్రారంభమవుతుందని కేంద్రం తెలిపింది. ప్రస్తుతం గుజరాత్, అస్సాం, ఉత్తరప్రదేశ్‌లలో ఆరు సెమీకండక్టర్ ప్లాంట్లు నిర్మాణ దశలో ఉన్నాయని గతంలో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తికావడంతో దేశపు మొదటి స్వదేశీ చిప్ అతి త్వరలో విడుదల కానుందని ఆయన ప్రకటించారు.

మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భవిష్యత్ ప్రపంచాన్ని రూపొందించే ప్రధాన సాంకేతికత అని చెప్పుకొచ్చారు. ఇది అందరికీ అందుబాటులో ఉండాలన్నది ప్రధాని నరేంద్ర మోదీ యొక్క దృష్టి అని తెలిపారు. AI కొద్దిమందికి మాత్రమే పరిమితం కాకూడదని.. అందుకోసమే మేము ఇండియా AI మిషన్ ప్రారంభించామని తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా 34 వేల GPUలు (గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు) ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చాయన్నారు.
సెమీకండక్టర్ యూనిట్ల ఆమోదంతో పాటు, ప్రధానమంత్రి మోడీ నేతృత్వంలోని మంత్రివర్గం మంగళవారం పలు కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో ప్రధానమైనది లక్నో మెట్రో లైన్ విస్తరణ. ఈ ప్రాజెక్టు రూ. 5,801 కోట్ల వ్యయంతో అమలు చేయబడుతుంది. ఇది పట్టణ రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం, నగరవాసుల పెరుగుతున్న ప్రయాణ అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది.
అలాగే ఈశాన్య భారతదేశంలో ఉన్నత విద్యా వసతులను విస్తరించేందుకు.. గౌహతిలో కొత్త ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) ను స్థాపించేందుకు కేంద్ర మంత్రివర్గం బిల్లును ఆమోదించింది. షిల్లాంగ్‌లో ఇప్పటికే ఒక IIM ఉన్నప్పటికీ.. గౌహతి ఐఐఎం ఈశాన్య ప్రాంతంలో రెండవది కానుంది. ఇది ప్రాంతీయ మేనేజ్‌మెంట్ విద్యను బలోపేతం చేయడమే కాకుండా, ప్రతిభావంతులైన విద్యార్థులకు మరిన్ని అవకాశాలను కల్పించనుంది.


Click it and Unblock the Notifications