పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై ఊహించని రీతిలో ప్రభావం చూపుతోంది. కేవలం ముడి చమురు, ఎల్‌పిజి ధరలకే పరిమితం కాకుండా, ఈ ప్రభావం ఇప్పుడు దేశీయ గర్భనిరోధక (కండోమ్) పరిశ్రమను, నిర్మాణ రంగాన్ని, గాజు పరిశ్రమను తీవ్రంగా దెబ్బతీస్తోంది.ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి హార్ట్ వంటి హార్ముజ్ జలసంధి గుండా రవాణా కష్టతరంగా మారింది.
దీనివల్ల మన దేశానికి మధ్యప్రాచ్య దేశాల నుండి అందాల్సిన కీలకమైన ముడి రసాయనాల సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిన్నది. ముఖ్యంగా కండోమ్ తయారీలో అత్యంత కీలకమైన అనహైడ్రస్ అమ్మోనియాలో 86 శాతం వాటా సౌదీ అరేబియా, ఖతార్, ఒమన్ దేశాల నుంచే వస్తుంది. రవాణా అంతరాయాల వల్ల ఈ అమ్మోనియా ధరలు ఏకంగా 50 శాతం వరకు పెరగడం, దాంతో పాటు కందెనగా వాడే సిలికాన్ ఆయిల్ కొరత ఏర్పడటం వల్ల దేశీయ కండోమ్ పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో మునిగిపోయింది.

ఈ పరిస్థితి కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాకుండా.. దేశ ప్రజారోగ్యంపై తీవ్రమైన ముప్పును కలిగిస్తోంది. మ్యాన్‌కైండ్ ఫార్మా, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ వంటి కంపెనీలు ఉత్పత్తి వ్యయాన్ని భరించలేక condom ధరలు పెంచే దిశగా ఆలోచిస్తున్నాయి. కండోమ్‌ల ధరలు స్వల్పంగా పెరిగినా, సమాజంలోని పేద, బలహీన వర్గాలు వాటిని ఉపయోగించడం మానేసే ప్రమాదం ఉంది.
దీనివల్ల దేశంలో ప్రణాళిక లేని గర్భాలు పెరగడమే కాకుండా, లైంగికంగా సంక్రమించే వ్యాధులు (STIs), హెచ్‌ఐవి వంటి వ్యాధులు వేగంగా విస్తరించే అవకాశం ఉంది. తద్వారా గత కొన్ని దశాబ్దాలుగా కుటుంబ నియంత్రణ, ప్రజారోగ్యం విషయంలో సాధించిన పురోగతి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ యుద్ధ ప్రభావం దేశ నిర్మాణ రంగాన్ని, తయారీ రంగాలను కూడా కుదిపేస్తోంది. పెరుగుతున్న ఎల్‌ఎన్‌జి (LNG), ఇంధన ధరల వల్ల సిమెంట్, ఉక్కు వంటి నిర్మాణ సామాగ్రి ధరలు ఆకాశాన్ని తాకాయి. గుజరాత్‌లోని మోర్బి వంటి పారిశ్రామిక ప్రాంతాల్లో సిరామిక్ టైల్స్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. అలాగే, గ్యాస్‌పై ఆధారపడే గాజు పరిశ్రమ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఉన్న అనేక గాజు తయారీ యూనిట్లు తమ కొలిమిలను ఆపివేయడం వల్ల ఔషధాల సీసాలు, పానీయాల సీసాల సరఫరాలో భారీ కొరత ఏర్పడింది. ఇలా ఒక ప్రాంతంలో మొదలైన యుద్ధం, సరఫరా గొలుసుల ద్వారా దేశంలోని మారుమూల గ్రామంలో ఉండే సామాన్యుడి ఆరోగ్యం, జీవనోపాధిని కూడా ప్రభావితం చేస్తోంది.


Click it and Unblock the Notifications