ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్‌రాజన్ దేశ ఆర్థిక వ్యవస్థపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో రియల్ ఎస్టేట్ రంగం, నిర్మాణ రంగం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కోనున్నాయని ఆయన హెచ్చరించారు. తాజాగా ఇండియా టుడే పత్రికలో ఆయన దీనికి సంబంధించిన పలు కీలక విషయాలను వెల్లడించారు,
ప్రస్తుతం దేశంలోని గ్రామీణ ప్రాంతాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయని తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల్లో వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరిన విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగం రేటు కూడా తీవ్ర స్థాయిలో ఉందని పేర్కొన్నారు.

రియల్టీ, కన్‌స్ట్రక్షన్, మాన్యుఫాక్చర్ కంపెనీలకు పెద్ద మొత్తంలో రుణాలిచ్చే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ)ల ఆస్తుల నాణ్యతను పరిశీలించాల్సి ఉందని కూడా రఘురామ్ రాజన్ ఆయన అభిప్రాయపడ్డారు. టాప్ 50 నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల పనితీరును ఆర్‌బీఐ సమీక్షిస్తుందని, వాటి పనితీరును, వాటి ఎసెట్ క్వాలిటీని కూడా సమీక్షించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.
ఆర్‌బీఐ ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ కూడా గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. షాడో బ్యాంకింగ్ రంగంలోని మొత్తం ఆస్తులలో 75 శాతం వాటా ఉన్న టాప్ 50 నాన్-బ్యాంక్ ఫైనాన్షియర్లను సెంట్రల్ బ్యాంక్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే అతి ముఖ్యమైన పెద్ద ఎన్‌బీఎఫ్‌సీలు మున్ముందు కుప్పకూలకుండా కూడా ఆర్‌బీఐ అవసరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో శనివారం ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, సుమారు 66 బిలియన్ల యూఎస్ డాలర్ల మేర బకాయిలు ఉన్నటు ఇటీవల ఓ సర్వే కూడా తెలియజేసిందని పేర్కొన్నారు. మరోవైపు ప్రాపర్టీ కన్సల్టెంట్ జేఎల్‌ఎల్ కూడా స్పందిస్తూ సుమారు 4.54 లక్షల యూనిట్ల నిర్మాణాలు సకాలంలో పూర్తి కాకుండా ఉండిపోయాయని తెలిపింది.


Click it and Unblock the Notifications