India IT layoff News : ప్రపంచ వ్యాప్తంగా దూసుకువస్తున్న ఆర్థికమాంద్యం భారత ఐటీ రంగాన్ని వణికిస్తోంది. గ్లోబల్ వైడ్ గా పరిస్థితుల అనిశ్చిత మధ్య కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ రంగంలో సంక్షోభం నెలకొంది. మనుగడ కాపాడుకునేందుకు ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. ఖర్చులు తగ్గించుకుందుకు అనుభవం కలిగిన నిపుణులకు ఎక్కువ జీతాలు ఇవ్వలేక ఉద్యోగాల నుండి తొలగిస్తోంది. దీనికి సంబంధించిన తాజాన నివేదిక ఐటీ రంగంలోని సంక్షోభాన్ని మరోసారి ఎత్తి చూపుతోంది.
హైరింగ్, వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్‌లో నిష్ణాతులైన ఎక్స్‌ఫెనో (Xpheno) సంస్థ తెలిపిన గణాంకాల ప్రకారం..ఐటీ రంగంలో సీనియర్ లెవల్ ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. కంపెనీల వ్యాపార వృద్ధి మందగించడం, ఖర్చులను తగ్గించాల్సిన అవసరం పెరగడంతో మిడ్ లెవల్ ఉద్యోగులను కంపెనీలు ఇంటికి సాగనంపుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత విస్తృత వినియోగంతో అధిక జీతాలు తీసుకునే అనుభవజ్ఞులైన ఉద్యోగులు రోడ్డు మీదకు రావాల్సిన పరిస్థితి నెలకొంది.

ఈ డేటా ప్రకారం చూసుకున్నట్లయితే.. గత 12 నెలల్లో 15 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన 7 వేల మందికి పైగా సీనియర్ ప్రొఫెషనల్స్ దేశంలోని ఏడు ప్రధాన ఐటీ దిగ్గజాలైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సిఎల్ టెక్, కాగ్నిజెంట్, ఎల్‌టిఐ మైండ్‌ట్రీ, టెక్ మహీంద్రా కంపెనీలను విడిచిపెట్టారు. ఈ కంపెనీల్లో సీనియర్ స్థాయిలో ఉన్న సుమారు 2,05,000 ఉద్యోగుల్లో ఇది 4 శాతం వాటాగా ఉంది.
కంపెనీ నుంచి బయటకు వెళ్లిన వీరిలో 43 శాతం మంది ఇతర పెద్ద లేదా మధ్యస్థ ఐటీ కంపెనీల్లో చేరారు. ఇక మరో 48 శాతం మంది గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) లో సీనియర్ పదవులకు మారారు. మిగిలిన 9 శాతం మంది భారతీయ సాంకేతిక లేదా సాంకేతికేతర సంస్థల్లో కొత్త ఉద్యోగాల్లో చేరారు. అయితే.. బయటకు వచ్చిన వీరిలో ఎంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.. ఎంతమంది తొలగింపుల వల్ల బయటకు వెళ్లారు అనే దానిపై ఎటువంటి స్పష్టత లేదు. పరిశ్రమలోని వర్గాల అంచనా ప్రకారం.. చాలా మంది ఉద్యోగులను స్వచ్ఛంద రాజీనామా చేయమని ఒత్తిడి తెచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ ఒత్తిడి ప్రధానంగా TCSలో 12 వేల మందికి పైగా మధ్య, ఉన్నత స్థాయి ఉద్యోగులను తొలగించనున్నట్లు వచ్చిన ప్రకటన తర్వాత భారీగా పెరిగింది. వీరిలో చాలామంది 50 ఏళ్లు పైబడిన, రెండు దశాబ్దాల కంటే ఎక్కువ అనుభవం కలిగినవారు ఉన్నారు. చాలా కాలంగా ఒకే కంపెనీతో పనిచేస్తూ, స్థిరమైన పదవుల్లో ఉన్న వీరు ఇప్పుడు ఉద్యోగ భద్రతపై అనిశ్చితిలో ఉన్నారు.సాధారణంగా TCSలో ఉద్యోగుల గ్రేడింగ్ Y స్థాయి ట్రైనీగా మొదలవుతుంది. అనంతరం సిస్టమ్ ఇంజనీర్ C1, C2, C3 (A & B), C4, C5, ఆపై CXO స్థాయికి ఎదుగుతారు. అయితే C3 స్థాయి పైబడిన వారిని సీనియర్‌గా పరిగణిస్తారు. టీసీఎస్ తాజా తొలగింపులు ప్రధానంగా C5, అంతకంటే ఎక్కువ స్థాయిల్లో ఉన్నవారిని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం.
నాస్కామ్ సీనియర్ అధికారి ప్రకారం.. మధ్యస్థ, ఉన్నత స్థాయి తొలగింపులు ఆశ్చర్యకరం కలిగిస్తున్నాయన్నారు. ఇప్పటివరకు ఏఐను కొత్తగా నియమించుకునే జూనియర్ ఉద్యోగులను భర్తీ చేయడానికి వాడతారని భావించాం. అయితే పరిస్థితి మారిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అన్ని స్థాయిల్లోనూ ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. ఏఐ టూల్స్, ఆటోమేషన్ సిస్టమ్స్ వల్ల అనుభవజ్ఞుల పనిలో కొంత భాగం తగ్గిపోవడంతో.. కంపెనీలు తక్కువ ఖర్చుతో యువ ఉద్యోగులను తీసుకోవడానికి మొగ్గుచూపుతున్నాయి.
బిజినెస్ స్టాండర్డ్ విశ్లేషణ ప్రకారం చూసుకున్నట్లయితే.. గత 10 సంవత్సరాల్లో ఈ ఐటీ దిగ్గజాలు తమ ఆదాయంలో కేవలం 13.5 శాతం మాత్రమే వ్యాపార విస్తరణ, ఇన్నోవేషన్ కోసం ఖర్చు చేశాయి. అదే సమయంలో 73 శాతం ఆదాయాన్ని డివిడెండ్లు, షేర్ బైబ్యాక్‌ల రూపంలో షేర్‌హోల్డర్లకు తిరిగి ఇచ్చాయి. దీని అర్థం ఏంటంటే.. తక్షణ లాభాలకు ప్రాధాన్యం ఇస్తూ దీర్ఘకాల వృద్ధి కోసం పెట్టుబడులు తగ్గించడమేనని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం భారత ఐటీ రంగం తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం అనే మోడల్ మీద పనిచేస్తున్నట్లగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే భవిష్యత్తులో మధ్య-సీనియర్ స్థాయి ఉద్యోగులు మరింత ఒత్తిడిని ఎదుర్కునే అవకాశం ఉందని తెలుస్తోంది. AI వినియోగం పెరిగే కొద్దీ సీనియర్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోకుండా ఉండాలంటే జూనియర్లతో పోటీ పడుతూ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications