కరోనా మహమ్మారి దెబ్బతో చాలామంది ఉద్యోగాలు పోయాయి. కొత్తగా కొలువులు రావడంలేదు. మనదేశంలో హైరింగ్ సెంటిమెంట్ 15 సంవత్సరాల కనిష్టానికి చేరుకుందని, రానున్న మూడు నెలల్లో కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే ఉద్యోగుల నియామకం చేపడతామని తెలిపాయని మ్యాన్ పవర్ గ్రూప్ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 813 సంస్థలతో ఈ సర్వే నిర్వహించింది. నియామక ప్రణాళికలపై సర్వే చేసింది. దీని ప్రకారం చాలా కంపెనీలు ఉద్యోగులను నియమించుకునే ఆలోచనలో లేవు. మ్యాన్‍పవర్ గ్రూప్ ఎంప్లాయిమెంట్ ఔట్ లుక్ సర్వే ప్రకారం...

15 ఏళ్ల కనిష్టానికి..
ఉద్యోగ నియామకాలు 15 ఏళ్లలో తొలిసారి కనిష్టానికి దిగజారాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో నియామకాలకు సంబంధించి ఆచితూచి వ్యవహరించనున్నట్లు కంపెనీలు తెలిపాయి. ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చునని 7 శాతం కంపెనీలు వెల్లడించగా, ఉద్యోగుల సంఖ్య తగ్గవచ్చునని 3 శాతం కంపెనీలు అంచనా వేశాయి. ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని 54 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి. సర్వే ప్రారంభించిన 15 ఏళ్లలో ఈస్థాయికి ఎప్పుడు పడిపోలేదని తెలిపింది. అంతకుముందు క్వార్టర్‌తో పోలిస్తే మార్పులేదు. కానీ గత ఏడాదితో పోలిస్తే 16 శాతం మేర క్షీణత కనిపిస్తోందని వెల్లడించింది.

సాధారణ స్థితికి రావడానికి ఎంత టైం పడుతుందంటే
వచ్చే మూడు నెలల్లో నియామకాలు చేపడతామని కేవలం 3 శాతం కంపెనీలు మాత్రమే చెప్పాయి. కాలానికి అనుగుణంగా వైవిద్యాలను పరిగణలోకి తీసుకుంటే ఉద్యోగుల సంఖ్య పెరగవచ్చునని 3 శాతం కంపెనీలు చెప్పాయి. పెద్ద, మధ్యస్థాయి కంపెనీలతో పోలిస్తే చిన్న కంపెనీలలో హైరింగ్ సెంటిమెంట్ మెరుగ్గా ఉంది. ప్రాంతాలవారీగా చూస్తే పశ్చిమ, దక్షిణాదితో పోలిస్తే ఉత్తర, తూర్పు మార్కెట్ సానుకూలంగా ఉంది. నియామకాలు కరోనా పూర్వస్థితికి రావడానికి మరో 9 నెలలు పట్టవచ్చునని 44 శాతం కంపెనీలు తెలిపాయి. సాధారణ స్థాయికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని 42 శాతం కంపెనీలు పేర్కొన్నాయి.

తాత్కాలిక ఉద్యోగులపై...
ప్రస్తుతం ఉద్యోగం నిలుపుదల, తాత్కాలిక సెలవులపై ఉన్నవారిని తిరిగి తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు 42 శాతం కంపెనీలు మాత్రమే వెల్లడించాయి. అయితే, వారికి పని గంటలు తగ్గించాలని భావిస్తున్నాయి. 3 శాతం కంపెనీలు అయితే వారిని తీసుకోలేమని తేల్చి చెప్పాయి. భారత్‌తో పాటు తైవాన్, అమెరికా, టర్కీ, జపాన్, గ్రీస్, యూకే, సౌతాప్రికా, కొలంబియా వంటి 43 దేశాల్లో ఇది సర్వే చేసింది. ఇందులో 22 దేశాల్లో ఉద్యోగులను పెంచుకుంటామని ఎక్కువమంది చెప్పారు. 16 దేశాల్లో ఎక్కువమంది ఉద్యోగులను తగ్గించుకుంటామని చెప్పారు. ఐదు దేశాల్లో ఎక్కువమంది ఇప్పుడు ఉన్న ఉద్యోగులు ఉంటారని చెప్పారు.


Click it and Unblock the Notifications