భారత్‌లో ముంచుకొస్తున్న ఆహార, నీటి సంక్షోభం.. ధరల పెరుగుదలకు తోడవుతున్న సప్లై షాక్..
India's Food Security at Risk? అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు దేశీయంగా 'ఎల్ నినో' (El Nino) ప్రకంపనలు సృష్టిస్తున్న విలయం భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదై పంట ఉత్పత్తి భారీగా దెబ్బతినగా.. మధ్యప్రాచ్య సంక్షోభం సరఫరా వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. ఈ పరిణామాలు కేవలం నిత్యావసరాల ధరల పెరుగుదలకు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో తీవ్రమైన ఆహార, నీటి కొరతకు దారితీసి భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రారంభమై నెలలు గడుస్తున్న కొద్దీ.. కేవలం ముడి చమురు ధరలు మాత్రమే కాకుండా ఆహార పదార్థాల ధరలు కూడా గణనీయంగా ఎగబాకాయి. అమెరికా-ఇరాన్ ఘర్షణలు ఎప్పుడు ముగుస్తాయనే దానిపై ఎలాంటి స్పష్టత లేకపోవడం మార్కెట్లలో తీవ్ర అనిశ్చితిని సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో వంట నూనెలు, పప్పుధాన్యాలు, ఉల్లిపాయలు, చక్కెర వంటి నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ తలకిందులవుతోంది. ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వాతావరణ కాలుష్యాలు, ఉత్పత్తి పడిపోవడం అసలు సమస్యగా మారింది.

Photo Credit: ANI
2026లో 'సూపర్ ఎల్ నినో' ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్న తరుణంలో.. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కొరత కూడా తలెత్తుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు రెట్టింపు కాగా, నీటి లభ్యత తగ్గడం వల్ల చెరకు సాగు కుదేలై చక్కెర ధరలు కూడా భయపెడుతున్నాయి. ఈ తగ్గిన ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుండి వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల చమురుతో పాటు ఎరువులు, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. రవాణా, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరగడం పరోక్షంగా కూరగాయల నుండి తృణధాన్యాలు, వంట నూనెల వరకు ప్రతి ఒక్క వస్తువు ధరను అమాంతం పైకి లాగుతోంది.
వర్షాలు లేకపోవడం వల్ల మొదటగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. పంట దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులకు ఆదుకునేందుకు ప్రభుత్వం పంటల బీమా పథకాలు, రాయితీలు వంటివి ప్రకటించాల్సి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం విపరీతంగా పెరుగుతుంది. ఒకవేళ దిగుమతి బిల్లులు ఇదే రీతిలో ఎక్కువ కాలం కొనసాగితే దేశ స్థూల ఆర్థిక వ్యవస్థ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుంది.
మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఆసియా, ఆఫ్రికా దేశాల్లో తీవ్రమైన ఆహార సంక్షోభం తలెత్తుతుందని ఐక్యరాజ్యసమితి అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.. భౌగోళిక రాజకీయ ఘర్షణల వల్ల రాబోయే రోజుల్లో భారత్, ప్రపంచం ఆహార, ఎరువుల కొరతను ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వాలు సకాలంలో తగిన ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications
