Economy New: అందనంత స్పీడ్‌లో దూసుకెళ్తున్న ఎకానమీ.. లక్ష్య ఛేదన దిశగా దూకుడు
GDP Growth: కరోనా అనంతర పరిణామాల వల్ల ప్రపంచం అంతా ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది. అయితే అందుకు భిన్నంగా భారత్ విజయపథంలో దూసుకుపోతోంది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. తాజాగా రిలీజ్ అయిన జీడీపీ డేటా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
2023-24 ఆర్థిక ఏడాది మూడవ త్రైమాసికంలో భారత్ 8.4 శాతం వృద్ధిని సాధించి అంచనాలను అధిగమించింది. గత సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 4.3 శాతంతో పోలిస్తే గణనీయమైన అభివృద్ధిని నమోదు చేసింది. బలమైన దేశీయ డిమాండ్, అనుకూలమైన ప్రభుత్వ విధానాలు, స్థిరమైన రాజకీయ వాతావరణం సహా అనేక సానుకూల పరిణామాలు ఇందుకు కారణంగా కనిపిస్తున్నాయి.

దేశ ఆర్థిక పనితీరును ప్రధాని మోదీ ప్రశంసించారు. 2023-24 Q3లో బలమైన 8.4 శాతం GDP వృద్ధిపట్ల హర్షం వ్యక్తం చేశారు. దీంతో పూర్తి ఏడాదికిగాను వృద్ధిరేటు ప్రారంభ అంచనాలను మించి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అనుగుణంగా NSO కూడా తన అంచనాలను సవరించింది. ప్రారంభంలో 7.3 శాతమని భావించగా ఇప్పుడు దానిని కాస్తా 7.6 శాతానికి పెంచింది.
ఈ ఆకర్షణీయమైన వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో పలు కీలక రంగాలు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ప్రత్యేకించి ఉత్పాదక రంగం బలమైన పనితీరును ప్రదర్శించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అదనంగా మైనింగ్, క్వారీయింగ్, నిర్మాణ రంగాలు కూడా తమవంతు పాత్ర పోషించాయి. 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారతదేశాన్ని ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కాగా ఇది ఎంతో దూరం లేదని అర్థమవుతోంది.


Click it and Unblock the Notifications