Modi News: అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమిస్తూ భారత్ ఆర్థిక వృద్ధిలో ప్రపంచానికి దిక్సూచిలా మారింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించిన GDP గణాంకాలను నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (NSO) విడుదల చేసింది. అంతకు ముందు ఆర్థిక ఏడాది ఇదే సమయంతో పోలిస్తే మంచి పనితీరు కనబరిచింది.
భారత ఆర్థిక వ్యవస్థ 2023-24 సంవత్సరానికి గాను 8.2 శాతం వృద్ధి చెందినట్లు NSO ప్రకటించింది. తయారీ మరియు నిర్మాణ రంగాలు గణనీయంగా రాణించడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో 7.8 శాతం బలమైన నంబర్స్ పోస్ట్ చేయగలిగినట్లు తెలిపింది. అంతకు ముందు క్వార్టర్‌లో సవరించిన 8.6 శాతం కంటే కొంత తక్కువగా నమోదైంది. కాగా రిజర్వ్ బ్యాంక్ అంచనా 7 శాతం కంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.

ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ Xలో ఓ పోస్ట్ చేశారు. 2023-24కి సంబంధించిన Q4 GDP వృద్ధి డేటా మన ఆర్థిక వ్యవస్థలో బలమైన ఊపును చూపుతుందన్నారు. దీన్ని మరింత వేగవంతం చేసేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలానికి ఇదొక ట్రైలర్ అని స్పష్టం చేశారు. కాగా ఈ బలమైన వృద్ధి సంఖ్యలు భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా నిలిపాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పలు సవాళ్లు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా మరియు ఉత్సాహంగా కొనసాగుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ S&P భారత సావరిన్ రేటింగ్ ఔట్‌లుక్‌ను స్థిరమైన స్థాయి నుండి సానుకూలంగా సవరించడం మరియు ప్రభుత్వ ఖర్చుల నాణ్యతను మెరుగుపరచడం వంటి కారణాలు తాజా వృద్ధికి దోహదపడినట్లు తెలుస్తోంది.
ఆర్థిక వ్యవస్థలో 55 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న సేవల రంగం 2023-24లో 7.6 శాతం వృద్ధి చెందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే గతేడాది సాధించిన 10 శాతం కంటే నెమ్మదిగా ఉండటం కొంత ఆందోళన కలిగిస్తోంది. వ్యవసాయ రంగం కూడా అంతకు ముందు సంవత్సరం 4.7 శాతం వృద్ధిని కనబరచగా.. 2023-24లో కేవలం 1.4 శాతానికే పరిమితమైంది. అయితే రానున్న FY25లో 7 శాతం మేర వృద్ధి నమోదుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications