వస్తు రవాణాకు డిమాండ్ భారీగా పెరుగుతుండడంతో తపాలా శాఖ కూడా దీనిపై దృష్టి సారించింది. 2020 మార్చి నాటికి దేశ వ్యాప్తంగా పోస్టల్ హబ్స్, నోడల్ డెలివరీ సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే పార్సిల్ డెలివరీని పర్యవేక్షించేందుకు ఢిల్లీలో పార్సిళ్ల కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేయనుంది.
ఇప్పటి వరకు దేశీయ పార్సిల్ రంగంలో తపాలా శాఖ వాటా కేవలం 4 శాతమే. ఆదాయం కూడా 5 శాతం మాత్రమే. అయితే క్రమేణా వస్తు రవాణాకు పెరుగుతోన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని 2026 నాటికి మొత్తం మార్కెట్‌లో 15 శాతం వాటా దక్కించుకోవాలనే లక్ష్యాన్ని తపాలా శాఖ నిర్దేశించుకుంది.

ప్రస్తుతం దేశంలో పార్సిళ్ల మార్కెట్ విలువ రూ.18 వేల కోట్లు. ఇందులో తపాలా శాఖ వాటా కేవలం రూ.600 కోట్లు మాత్రమే. అయితే 2026 నాటికి స్వదేశీ పార్సిళ్ల రంగ ఆదాయం రూ.60 వేల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తోన్న తపాలా శాఖ.. అందులో రూ.9 వేల కోట్ల వాటాను చేజిక్కించుకోవాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది.
మరోవైపు తక్కువ ఖర్చుతో వేగవంతమైన సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ దేశ వ్యాప్తంగా 56 ప్రధాన నగరాలు, 134 ద్వితీయ శ్రేణి నగరాల్లో పోస్టల్ హబ్స్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అలాగే దేశవ్యాప్తంగా 242 నోడల్ డెలివరీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 నోడల్ డెలివరీ కేంద్రాలు, 12 పోస్టల్ హబ్స్ ఏర్పాటు చేయడానికి సంకల్పించింది. ఇప్పటికే విజయవాడలో ఆటోమేటిక్ పార్సిల్ సెంటర్ నిర్మాణం కూడా పూర్తి అయింది. పార్సిళ్ల రంగంలో 2026 నాటికి సముచిత స్థానం సాధించేందుకు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు విశాఖపట్నం పోస్టుమాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications