రూపాయి పతనం ఆపేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్.. ఇరాన్ యుద్ధం మధ్య విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా..
పశ్చిమ ఆసియాలో (ఇరాన్) రేగుతున్న యుద్ధ జ్వాలల ప్రభావం ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తుండటంతో, భారత ఆర్థిక వ్యవస్థను ఆ సంక్షోభం నుండి కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో (బాండ్లు) విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు) చేసే పెట్టుబడులపై మూలధన లాభాల పన్నును పూర్తిగా రద్దు చేసే ఆర్డినెన్స్‌కు ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. దీనితో పాటు, ఈ బాండ్ల ద్వారా విదేశీ పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీ ఆదాయంపై విధించే 20 శాతం భారీ విత్‌హోల్డింగ్ పన్నును కూడా పూర్తిగా తొలగించడం లేదా గణనీయంగా తగ్గించడంపై ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్రపతి ఆమోదం లభించిన వెంటనే ఈ కొత్త సవరణలు అమలులోకి రానున్నాయి.

భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతుండటమే ప్రభుత్వం ఇంతటి వేగవంతమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గమైన 'హార్ముజ్ జలసంధి' లో సరఫరా అంతరాయాలు తలెత్తుతాయనే ఆందోళనలు పెరిగాయి.
దీనివల్ల ఒకప్పుడు బ్యారెల్‌కు 70 డాలర్ల సమీపంలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు ఒక్కసారిగా దూసుకుపోయి 95 నుండి 105 డాలర్ల శ్రేణికి చేరుకున్నాయి. చమురు ధరల పెరుగుదల వల్ల విదేశీ సరఫరాదారులకు డాలర్ల రూపంలో భారీగా చెల్లింపులు చేయాల్సి వస్తోంది. ఇది దేశ కరెంట్ ఖాతా లోటును పెంచడమే కాకుండా విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడిని తీసుకువస్తోంది.
ఈ అంతర్జాతీయ పరిణామాల వల్ల అమెరికా డాలర్‌కు డిమాండ్ పెరిగి భారత రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోయింది. ఈ ఏడాది ఆరంభం నుండి రూపాయి విలువ ఏకంగా 5 నుండి 6 శాతానికి పైగా క్షీణించి, మే 20న డాలర్‌తో పోలిస్తే 96.965 వద్ద సార్వకాలిక కనిష్ట స్థాయిని తాకింది.
రూపాయి బలహీనపడటం వల్ల దిగుమతుల వ్యయం పెరగడమే కాకుండా విదేశీ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఎందుకంటే విదేశీ పెట్టుబడిదారులు తాము సంపాదించిన లాభాలను తిరిగి డాలర్లలోకి మార్చుకునేటప్పుడు, క్షీణిస్తున్న రూపాయి విలువ వల్ల వారి వాస్తవ రాబడులు తగ్గిపోతాయి.
ఈ ప్రతికూల వలయం వల్ల విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల (స్టాక్ మార్కెట్) నుండి ఈ ఏడాది రికార్డు స్థాయిలో దాదాపు రూ. 2.5 లక్షల కోట్లను (రూ. 2.47 లక్షల కోట్లు) ఉపసంహరించుకున్నారు. ముఖ్యంగా మార్చి నెలలోనే అత్యధికంగా రూ. 1.17 లక్షల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు, దీనివల్ల మార్చిలో నికర విదేశీ పెట్టుబడుల లోటు 11.7 బిలియన్ డాలర్లకు చేరింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు తైవాన్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), టెక్నాలజీ రంగాలు పుంజుకోవడం కూడా విదేశీ నిధులు భారత్ నుండి తరలిపోవడానికి కారణమైంది.
అయితే, విదేశీ పెట్టుబడిదారులు ఈక్విటీల నుండి తప్పుకుంటున్నా, భారత రుణ (బాండ్) మార్కెట్‌లో మాత్రం వారి ప్రవర్తన భిన్నంగా ఉంది. భౌగోళిక రాజకీయ అస్థిరత ఉన్న సమయంలో ప్రభుత్వ బాండ్లను సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తుండటంతో, ఈ ఏడాది ఇప్పటివరకు భారత ప్రభుత్వ రుణంలోకి 1.4 బిలియన్ డాలర్ల నికర విధుల ప్రవాహం కొనసాగింది.
ఈ సానుకూల ధోరణిని గమనించిన భారత విధాన రూపకర్తలు, బాండ్లపై ఉన్న పన్ను భారాన్ని (12.5 శాతం దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను, 20 శాతం విత్‌హోల్డింగ్ పన్ను) తొలగించడం ద్వారా గ్లోబల్ ఫండ్‌లు, పెన్షన్ మేనేజర్‌లు, బీమా కంపెనీల వంటి దీర్ఘకాలిక సంస్థాగత పెట్టుబడిదారులను ఆకర్షించాలని పందెం కాశారు. ఈక్విటీలతో పోలిస్తే బాండ్లలో వచ్చే పెట్టుబడులు మరింత స్థిరంగా ఉండి, ఆకస్మికంగా దేశం దాటి వెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. నిజానికి అంతర్జాతీయంగా రుణ మార్కెట్లలో ప్రవాస పెట్టుబడులపై పన్ను విధిస్తున్న అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటి కావడం గమనార్హం.
ఈ పన్ను రాయితీల వల్ల విదేశీ మారక నిల్వలు బలోపేతమవడమే కాకుండా రూపాయిపై ఒత్తిడి తగ్గుతుంది. అలాగే దేశీయ మూలధన వనరులపై భారం పడకుండా ప్రభుత్వం తన రుణ అవసరాలను తీర్చుకోగలుగుతుంది. దీనికి తోడు, విదేశీ పెట్టుబడిదారులు ఎటువంటి నియంత్రణ పరిమితులు లేకుండా కొన్ని దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసేందుకు వీలుగా 'ఫుల్లీ యాక్సెసబుల్ రూట్' (FAR) ద్వారా నిర్దేశిత సార్వభౌమ సెక్యూరిటీల పరిధిని విస్తరించాలని ఆర్‌బీఐ (RBI) కూడా యోచిస్తోంది. కేంద్ర కేబినెట్ ఆమోదం లభించిందన్న వార్తలు రాగానే మార్కెట్ సానుకూలంగా స్పందించింది, దేశీయంగా బెంచ్‌మార్క్ ప్రభుత్వ బాండ్ ఈల్డ్ ఒక బేసిస్ పాయింట్ తగ్గి 7.01 శాతానికి చేరుకోవడం విశేషం.


Click it and Unblock the Notifications
