Pakistan News: పొరుగున ఉన్న దాయాది దేశం పాక్ ఇప్పటికే చేసిన తప్పుల కారణంగా ఆర్థికంగా అంధకారాన్ని అనుభవిస్తోంది. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేస్తూ.. కష్టాలతో కొట్టుమిట్టాడుతోంది.
ఈ క్రమంలో పొరుగున ఉన్న పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలించేందుకు భారత్ సిద్ధమవుతోంది. నివేదిక ప్రకారం ఇండియా ఎగుమతి చేసే బాస్మతి బియ్యం ధరలపై రాబోయే రోజుల్లో తగ్గింపును ప్రకటించవచ్చని తెలుస్తోంది. బాస్మతి బియ్యం ఎగుమతి తగ్గడంపై మిల్లు యజమానులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం భారత్ కంటే పాకిస్థాన్ తక్కువ ధరలకు బియ్యాన్ని ఎగుమతి చేయటమే ఇందుకు కారణంగా ఉంది.

భారత బాస్మతి బియ్యం ధరలను టన్నుకు 850 డాలర్లకు తగ్గించవచ్చని రాయిటర్స్ నివేదించింది. ప్రస్తుతం టన్ను 1200 డాలర్ల చొప్పున విక్రయిస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత నెలలోనే బాస్మతి బియ్యం ఎగుమతి ధరను టన్నుకు 1200 డాలర్లుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఇరాక్, ఇరాన్, యెమెన్, సౌదీ అరేబియా, యూఏఈలకు భారత్ బియ్యాన్ని విక్రయిస్తోంది. మెుత్తంగా అంతర్జాతీయ మార్కెట్లో 4 మిలియన్ టన్నుల బాస్మతి బియ్యాన్ని విక్రయిస్తోంది. ఈ మార్కెట్‌లో భారత ప్రభుత్వం పాకిస్థాన్‌తో గట్టి పోటీని ఎదుర్కొంటోంది.
ప్రపంచంలో రెండవ అతిపెద్ద బాస్మతి ఎగుమతిదారుగా ఉన్న పాకిస్థాన్ ఒక టన్ను బాస్మతి బియ్యాన్ని 1050 డాలర్లకు విక్రయిస్తోంది. ఇది భారత్ అమ్ముతున్న ప్రస్తుత ధర కంటే 150 డాలర్లు తక్కువ. అయితే ప్రభుత్వం బాస్మతి బియ్యం ఎగుమతి రేటును 850 డాలర్లకు తగ్గిస్తే పాకిస్థాన్ ముందు కొత్త సమస్య తలెత్తనుంది. భారతదేశంలో కొత్త వరి పంట దాదాపు సిద్ధంగా ఉన్నందున రానున్న నెల రోజుల్లో కొత్త బియ్యం కూడా మార్కెట్‌లోకి వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం ధరలను తగ్గించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications