Adani News: టార్గెట్ అదానీ..! రంగంలోకి కేంద్ర ప్రభుత్వం.. ఎయిర్‌పోర్ట్స్ అకౌంట్స్ ఆడిట్..
Adani News: గౌతమ్ అదానీ వ్యాపారాలపై రోజురోజుకూ అనుమానాలు పెరిగిపోతున్నాయి. అధికారుల వరుస దర్యాప్తులు, దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలో నడుస్తున్న ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్. ముంబైలోని గ్రూప్ నిర్వహిస్తున్న రెండు విమానాశ్రయాల అకౌంట్లను భారత కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. కంపెనీ ఈ విషయాన్ని శుక్రవారం ధృవీకరించింది. 2017-18 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన సమాచారంతో పాటు సంబంధిత పత్రాలను మంత్రిత్వ శాఖ సేకరిస్తోంది.

అదానీ నిర్వహిస్తున్న ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్, నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఖాతాలపై ప్రస్తుతం దర్యాప్తు మెుదలైంది. ప్రస్తుతం అదానీ గ్రూప్ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా దేశవ్యాప్తంగా ఏడు విమానాశ్రయాలను 50 ఏళ్ల కాలానికి నిర్వహించేందుకు దక్కించుకుంది. 2019లో ప్రభుత్వ విమానాశ్రయాల నిర్వహణ ప్రైవేటీకరణ చొరవలో భాగంగా ఆరు విమానాశ్రయాలను అదానీ గ్రూప్ దక్కించుకుంది. 2021లో జీవీకే ఎయిర్ పోర్ట్స్ నుంచి కంపెనీ ముంబై విమానాశ్రయాలను దక్కించుకుంది.
చట్టాలకు విరుద్దంగా గంపగుత్తుగా అదానీకి విమానాశ్రయాలను కట్టబెట్టడంపై దేశంలో రాజకీయ పార్టీలు సైతం మోదీ సర్కారును ప్రశ్నించాయి. జూలై 2020లో జీవీకే గ్రూప్ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ మోసపూరిత పద్ధతుల కారణంగా ప్రభుత్వానికి రూ.705 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. జీవీకె గ్రూప్ చైర్మన్ జీవీకె రెడ్డి, అతని కుమారుడు వెంకట సంజయ్ రెడ్డి ఈ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications