ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో పెరుగుదల చూస్తే షాకే..మూడీస్ రిపోర్ట్ చెబుతోందేంటి..?
కరోనావైరస్ ప్రభావం దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా ఉండబోతోందని ప్రముఖ ఆర్థిక సంస్థ మూడీస్ అంచనా వేసింది. కరోనావైరస్ విజృంభణతో దేశ ఆర్థిక వృద్ధిలో గణనీయమైన క్షీణత చోటుచేసుకుంటుందని పేర్కొంది. అది ఎంతలా ఉంటుందంటే 0శాతంకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని మూడీస్ సంస్థ విశ్లేషించింది. 2021 ఆర్థిక సంవత్సరానికి గాను ఎలాంటి ఆర్థిక వృద్ధి భారత్‌లో నమోదు కాదని జోస్యం చెప్పింది. అయితే 2022 ఆర్థిక సంవత్సరంలో మాత్రం తిరిగి పుంజుకుని 6.6శాతం జీడీపీ సాధిస్తుందని అంచనా వేసింది.

జీడీపీలో 5.5శాతంపెరిగిన ఆర్థికలోటు
2021 ఆర్థికసంవత్సరంలో ఆర్థికలోటు జీడీపీలో 5.5శాతం పెరిగిందని మూడీస్ పేర్కొంది. అయితే 3.5శాతమే ఆర్థికలోటు ఉంటుందని బడ్జెట్ సందర్భంగా కేంద్రం ప్రకటించింది. దేశంలో మన్నికైన ఆర్థిక ఏకీకరణ యొక్క అవకాశాలను కోవిడ్-19 గణనీయంగా తగ్గించిందని మూడీస్ నివేదిక పేర్కొంది. ఇదిలా ఉంటే మూడీస్ పెట్టుబడుల సర్వీస్ BAA2 గ్రేడింగ్ విధానం ప్రకారం దేశ ఆర్థిక పరిస్థితి స్థిరత్వం నుంచి ప్రతికూలత వైపు కదులుతోందని గతేడాది నవంబర్‌లో తెలిపింది. ఇది వృద్ధి మందగించడంతోనే జరిగిందని పేర్కొంది. దేశ రుణస్థాయిలను నిశితంగా పరిశీలిస్తామని మూడీస్ పేర్కొంది.

ఆర్థి వ్యవస్థ బలహీనతపడేందుకు ఇవే కారణాలు
గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక ఒత్తిళ్లు, ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, నాన్-బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్‌టిట్యూషన్స్ రుణాలు ఇవ్వడంలో స్థిరత్వం లేకపోవడం వంటివి ఆర్థిక వ్యవస్థను మరింత బలహీనపడేలా చేశాయని మూడీస్ అభిప్రాయపడింది. నామమాత్రపు జీడీపీ వృద్ధి అధిక రేటుకు తిరిగి రాకపోతే, బడ్జెట్ లోటును తగ్గించడంలో మరియు రుణ భారం పెరగకుండా నిరోధించడంలో ప్రభుత్వం చాలా అడ్డంకులను ఎదుర్కొంటుందని మూడీస్ చెబుతోంది.
భారత ప్రభుత్వం ఇప్పటివరకు 1.7ట్రిలియన్ రూపాయలు కోవిడ్-19తో ఇబ్బందులు పడుతున్న వారికి నగదు రూపంలో బదిలీ చేయడమే కాకుండా ఆహార భద్రతకు ఖర్చుచేసిందని గుర్తు చేసింది. అదే సమయంలో చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఊతమిచ్చేందుకు మరో ప్యాకేజీ ప్రకటించిందని గుర్తుచేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడప్పుడే క్షీణత నుంచి స్థిరత్వంకు చేరుకునే అవకాశాలు కనిపించడం లేదని మూడీస్ చెబుతోంది.

ఆర్థిక వ్యవస్థను ఇప్పుడప్పుడే బలోపేతం చేయలేరు
ఇప్పటికే భారత్ ఎనిమిది వారాల పాటు లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోవడంతో ప్రపంచదేశాల్లోనే అత్యధిక నష్టం భారత ఆర్థిక వ్యవస్థ చవిచూసిందని మూడీస్ చెబుతోంది. తక్కువ వృద్ధి ,ప్రభుత్వ ఆదాయ ఉత్పత్తి, కరోనావైరస్-సంబంధిత ఆర్థిక ఉద్దీపన చర్యలతో పాటు, అధిక ప్రభుత్వ రుణ నిష్పత్తులకు దారి తీస్తుందని, ఇది రాబోయే కొన్నేళ్లలో జీడీపీలో 81శాతంకు పెరుగుతుందని తాము భావిస్తున్నట్లు తెలిపింది మూడీస్.
మధ్యంతర ఆర్థిక ఏకీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడం అంత సులభమైన పని కాదని పేర్కొంది. ఒకవేల ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయాలనే క్రమంలో రుణభారం పెరిగిపోతుందని అంచనా వేసింది మూడీస్. ఇది కచ్చితంగా జీడీపీ వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ తెలిపింది.


Click it and Unblock the Notifications