iPhone News: తొలిసారిగా భారత్ మేడ్ ఐఫోన్లు.. విడుదల రోజే.. పూర్తి వివరాలు..
iPhone News: ఆపిల్ కొత్త ఉత్పత్తులను విడుదల చేస్తుందంటే దాని ఫ్యాన్స్ తొలిరోజే వాటిని దక్కించుకోవాలని చూస్తుంటారు. కొన్ని దేశాల్లో అయితే స్టోర్ల వద్ద బారులు తీరిన ఘటనలు కోకొల్లలు. అది ఐఫోన్లు, ఆపిల్ ఉత్పత్తులకు ఉండే క్రేజ్.
అయితే ఒకప్పుడు ఇవన్నీ చైనాలోనే ఉత్పత్తి అయ్యేవి. కానీ కంపెనీ తన ఉత్పత్తులను మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్‌లో తయారు చేస్తోంది. ఈ క్రమంలో ఆపిల్ ఇంక్ ఇండియాలో తయారైన ఐఫోన్ 15ని దక్షిణాసియాతో పాటు మరికొన్ని ఇతర గ్లోబల్ ప్రాంతాల్లో తొలిరోజే అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోందని సమాచారం. మేడ్ ఇండియా ఐఫోన్ తొలిరోజే విక్రయించటం మెుదటిసారిగా జరగనుందని తెలుస్తోంది.

ఇది పెరుగుతున్న భారత ఉత్పత్తి నైపుణ్యానికి అద్ధం పడుతోంది. అమెరికాలోని కాలిఫోర్నియా కాలమానం ప్రకారం కొత్త ఐఫోన్ 15 మంగళవారం ఉదయం 10 గంటలకు ఆవిష్కరించబడిన కొన్ని రోజులు లేదా వారాల్లో రిటైల్ విక్రయాలకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. ఆపిల్ గత నెలలో దక్షిణ తమిళనాడులోని ఫాక్స్‌కాన్ టెక్నాలజీ గ్రూప్ ఫ్యాక్టరీలో ఐఫోన్ 15 ఉత్పత్తిని ప్రారంభించింది.
ఆపిల్ తన ఐఫోన్ 15 ఆవిష్కరణ తర్వాతి పదిరోజుల్లో అప్డేటెడ్ వాచ్ లు, ఐపాడ్స్ అందుబాటులోకి తీసుకురానుందని వెల్లడైంది. భారత ప్రధాని నరేంద్రమోదీ దేశీయ ఉత్పత్తికి అందిస్తున్న ప్రోత్సాహకాలతో చైనాను క్రమంగా పక్కన పెడుతూ ఆపిల్ ఇండియాలో తన ఉత్పత్తిని క్రమంగా పెంచుతోంది. ప్రస్తుతం అమెరికా-చైనా ట్రేడ్ వార్ కారణంగా భారత్ లాభపడుతోందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications