Rupee Payments: డాలర్ ఆధిపత్యానికి ఇండియా బ్రేక్.. UAE ఆయిల్‌కు భారత్ రూపీ పేమెంట్..
Rupee Payments: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పింది అనడంలో సందేహం లేదు. పాశ్చాత్య దేశాల పోకడలు, డాలర్ ఆధిపత్యం, చమురు ఉత్పత్తి వంటి పలు విషయాల్లో ఆయా దేశాల ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చివేసింది. ముఖ్యంగా డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీ అవసరాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది.
విశ్వగురువుగా అవతరించాలని చూస్తున్న భారత్.. అభివృద్ధి దిశగా ఎదగడానికి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. డాలర్ కు ప్రత్యామ్నాయంగా యువాన్ ను వాడుకలోకి చొప్పించాలని పొరుగు దేశం చైనా తహతహలాడుతోంది. దానికి పోటీగా రూపీని హైలెట్ చేయాలని ఇండియా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే రష్యాతో రూపీ-రూబుల్ బంధాన్ని కొనసాగిస్తోంది.

తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో సైతం లోకల్ కరెన్సీలతో ద్వైపాక్షిక వాణిజ్యం నిర్వహించేందుకు ఒప్పందం కుదిరింది. మిడిల్ ఈస్ట్ నుంచి మిలియనల్ కొద్దీ బ్యారెళ్ల చమురు కొనుగోళ్ల పేమెంట్స్ ఇకపై రూపాయిల్లో చేయనున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. మొదటి చెల్లింపు సైతం పూర్తి చేసినట్లు పేర్కొంది.
అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రూపాయల్లో పేమెంట్ చేసినట్లు UAEలోని భారత రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే దానికి ముందే ఓ UAE బంగారం ఎగుమతిదారు నుంచి 25 కిలోల బంగారాన్ని ఇండియాలోని ఓ కొనుగోలుదారు 128.4 మిలియన్ రూపాయలు చెల్లించి కొనుగోలు చేశారు.
వివిధ దేశాలతో వాణిజ్య బంధాన్ని పెంచుకునే ప్రణాళికలో భాగంగా.. ఇండియా రూపీ పేమెంట్స్ కు మొగ్గు చూపుతోంది. తద్వారా డాలర్ మార్పిడి ఖర్చులు తగ్గించుకోవాలని చూస్తోంది. కేవలం కరెన్సీ చెల్లింపులే కాకుండా.. భారత UPI టెక్నాలజీని ఉపయోగించి సింగపూర్, ఫ్రాన్స్ తో ఆన్ లైన్ పేమెంట్స్ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని దేశాలను ఈ ప్లాన్ లో భాగం చేయాలని భారత్ భావిస్తోంది.


Click it and Unblock the Notifications