ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు సంభవించబోతున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ వాణిజ్యంలో అమెరికా డాలర్ హవా నడుస్తోంది. కానీ, ఇప్పుడు BRICS (బ్రిక్స్) దేశాలు ఈ గుత్తాధిపత్యానికి ముగింపు పలకాలని గట్టిగా నిర్ణయించుకున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వబోతున్న బ్రిక్స్ సమ్మిట్‌లో 'డిజిటల్ పేమెంట్ సిస్టమ్' ఒక సంచలనంగా మారబోతోంది.

ఇది కొత్త కరెన్సీ కాదు.. ఒక కొత్త వ్యవస్థ!
చాలా కాలంగా బ్రిక్స్ దేశాలు ఒకే కరెన్సీని తెస్తాయని ప్రచారం జరిగింది. కానీ, చైనా యువాన్ ఆధిపత్యం పెరుగుతుందన్న భయం, దేశాల మధ్య ఆర్థిక అసమానతల వల్ల అది సాధ్యం కాలేదు. అందుకే ఇప్పుడు ఒక మెట్టు దిగి, కరెన్సీకి బదులుగా ఒక 'కామన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్'ను రూపొందిస్తున్నారు. ఇది మన దేశంలోని UPI తరహాలో, సభ్య దేశాల డిజిటల్ కరెన్సీలను (CBDCs) ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. అంటే భారత్ తన డిజిటల్ రూపాయిని, చైనా తన డిజిటల్ యువాన్‌ను నేరుగా వాడుకోవచ్చు. మధ్యలో డాలర్ ప్రసక్తి ఉండదు.
భారత్ ఎందుకు కీలకంగా మారింది?
ఈ సరికొత్త వ్యవస్థ రూపకల్పనలో బ్రిక్స్ (BRICS) దేశాల్లో భారత్ పాత్ర చాలా కీలకం. మన దేశంలో UPI సాధించిన విజయం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే భారత్ తన డిజిటల్ రూపాయిని కేవలం క్రిప్టో కరెన్సీలా కాకుండా.. సార్వభౌమ కరెన్సీగా చూస్తోంది. రష్యా నుంచి గతంలో చమురు కొన్నప్పుడు వచ్చిన 'రూపీ ట్రాప్' (భారీగా రూపాయలు పేరుకుపోవడం) వంటి సమస్యలను అధిగమించడానికి ఈ కొత్త మల్టీలేటరల్ సిస్టమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది?
ఈ కొత్త సిస్టమ్ రెండు ప్రధాన సూత్రాల మీద పనిచేస్తుంది..
- సెటిల్‌మెంట్ సైకిల్స్: ప్రతి చిన్న లావాదేవీని అప్పటికప్పుడే సెటిల్ చేయకుండా ఒక నిర్ణీత కాలం తర్వాత నికర వ్యత్యాసాన్ని (Net amount) మాత్రమే బదిలీ చేస్తారు. దీనివల్ల ఖర్చులు తగ్గుతాయి.
- ఫారెక్స్ స్వాప్ లైన్స్: ఒక దేశానికి మరో దేశ కరెన్సీ అత్యవసరంగా కావాల్సి వచ్చినప్పుడు.. సెంట్రల్ బ్యాంకులు నేరుగా కరెన్సీలను మార్చుకునే వెసులుబాటు ఉంటుంది.
డాలర్‌ను భయం పెడుతున్న జియో పాలిటిక్స్
అమెరికా అప్పులు దాదాపు 39 ట్రిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ప్రపంచం మొత్తం అమెరికా ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడటం ప్రమాదకరమని చాలా దేశాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత రష్యాను 'స్విఫ్ట్' నుంచి తొలగించి, వారి నిధులను స్తంభింపజేయడం చూశాక.. చైనా, ఇండియా వంటి దేశాలు తమ సొంత వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని చూస్తున్నాయి. BRICS తీసుకువచ్చే ఈ పేమెంట్ లేయర్ భవిష్యత్తులో గ్లోబల్ షాక్ అబ్జార్బర్‌లా పనిచేస్తుంది.
ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది?
ఈ వ్యవస్థ అమలులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఎందుకంటే చాలా దేశాల్లో డిజిటల్ కరెన్సీలు ఇంకా ట్రయల్ దశలోనే ఉన్నాయి. అయితే ఇప్పటికే భారత్ తన UPIని యూఏఈ (UAE) తో అనుసంధానించింది. ఇదే మోడల్‌ను బ్రెజిల్, చైనా వంటి దేశాలకు విస్తరిస్తూ.. మెల్లగా పూర్తి స్థాయి BRICS పేమెంట్ నెట్‌వర్క్‌ను నిర్మించనున్నారు.


Click it and Unblock the Notifications