E85: వాహనదారులకు పండగే.. పెట్రోల్ కన్నా రూ.20 చౌకగా కొత్త ఫ్యూయల్! అసలు ట్విస్ట్ ఏంటంటే..
వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రోజురోజుకూ మండిపోతున్న పెట్రోల్ ధరల (petrol prices) భారం నుంచి సామాన్యుడికి ఉపశమనం కలిగించేలా ఒక సూపర్ నిర్ణయం తీసుకుంది. సాధారణ పెట్రోల్ రేటు కంటే ఏకంగా రూ.20 తక్కువ ధరకే లభించే సరికొత్త ఇంధనాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ బంకులో ఈ 'E85' ఫ్యూయల్‌ను అధికారికంగా ప్రారంభించారు. అసలు ఈ ఇంధనం ఏంటి? దీనివల్ల ఎవరికి లాభం? మన బండ్లలో ఇది పోయించుకోవచ్చా? అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలు ఏంటి ఈ E85 ఫ్యూయల్?
చాలామందికి ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ గురించి తెలిసే ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఈ E85 ఇంధనంలో ఏకంగా 80 నుంచి 85 శాతం వరకు ఎథనాల్ ఉంటుంది. మిగిలిన 14 నుంచి 19 శాతం మాత్రమే సాధారణ పెట్రోల్ కలుపుతారు. దీనివల్ల కాలుష్యం చాలా వరకు తగ్గుతుంది. మన దేశంలో ఎథనాల్‌ను రైతులు పండించే పంటల (చెరకు, ధాన్యం వంటివి) వ్యర్థాల నుంచి తయారు చేస్తారు. కాబట్టి దీని తయారీ ఖర్చు తక్కువ. అందుకే సాధారణ పెట్రోల్ ధరల(petrol prices) తో పోలిస్తే దీని ధర లీటరుకు రూ.20 వరకు తక్కువగా ఉండబోతోంది.
అన్ని బండ్లకూ ఇది సెట్ అవుతుందా?
ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ E85 ఇంధనం అనేది కేవలం 'ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల' (Flex-Fuel Vehicles) కోసం మాత్రమే డిజైన్ చేశారు. అంటే ఎథనాల్‌తో నడిచే ప్రత్యేక ఇంజన్లు ఉన్న కార్లు, బైకుల్లో మాత్రమే దీనిని వాడాలి. మీ దగ్గర నార్మల్ పెట్రోల్ బండి ఉంటే అందులో దీనిని పోయకూడదు. ప్రస్తుతం దేశంలో వాడుతున్న E20 (20% ఎథనాల్) పెట్రోల్ వల్ల ఇప్పటివరకు ఎలాంటి ఇంజన్ సమస్యలు రాలేదని, కాబట్టి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని మంత్రి క్లారిటీ ఇచ్చారు.
ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీ!
ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (EVs) ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల ధరలు సాధారణ బండ్ల రేట్లలోనే ఉంటాయి. పైగా ఇప్పుడు ఇంధనం ధర కూడా రూ.20 తక్కువకే వస్తుండటంతో.. భవిష్యత్తులో ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలకు డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. నార్మల్ పెట్రోల్ బండ్లతో పోలిస్తే ఇవి 61 శాతం తక్కువ కాలుష్యాన్ని విడుదల చేస్తాయట.
దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి దొరుకుతుంది?
ప్రస్తుతానికి దేశంలోని మూడు ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలకు చెందిన 48 పెట్రోల్ బంకుల్లో ఈ E85 ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దశలవారీగా దీనిని దేశమంతటా విస్తరించనున్నారు. ఈ ఏడాది (2026) డిసెంబర్ నాటికి 500 బంకుల్లో, వచ్చే ఏడాది (2027) డిసెంబర్ నాటికి 5,000 బంకుల్లో ఈ చౌక ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది.
రైతులకు కాసుల వర్షం.. దేశానికి భారీగా ఆదా!
ఇప్పటివరకు మన దేశం పెట్రోల్ కోసం వేరే దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. కానీ ఈ ఎథనాల్ వాడకం పెరగడం వల్ల గత కొన్నేళ్లలో ఏకంగా రూ.1.84 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయిందట. అంతేకాదు, మన దేశంలో సగం వాహనాలు ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీకి మారితే.. రైతులకు అదనంగా రూ.12,403 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. మన అన్నదాతలు ఇకపై దేశానికి ఇంధనాన్ని అందించే 'ఊర్జదాతలు' కాబోతున్నారని ప్రభుత్వం గర్వంగా చెబుతోంది.
సో.. ఫ్యూచర్‌లో కొత్త బండి కొనాలనుకుంటే మాత్రం, ఖచ్చితంగా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్ ఉందో లేదో ఓసారి చెక్ చేసుకోండి!


Click it and Unblock the Notifications