అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ Trump భారతదేశపు చమురు దిగుమతులపై 50% దిగుమతి సుంకాలు విధించిన సంగతి విదితమే..ఈ అంశంపై ప్రధాని మోదీ తొలిసారిగా స్పందించారు. రైతుల ప్రయోజనాల కోసం దేశం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోదీ..ట్రంప్ సుంకాల విషయంలో తమ వైఖరి గురించి మాట్లాడారు.మోదీ మాట్లాడుతూ..మా దేశ రైతుల ప్రయోజనాలే మాకు అత్యంత ముఖ్యమైనవని స్పష్టం చేశారు. రైతులు, మత్స్యకారులు, పాడిరైతుల సంక్షేమంపై భారత్ ఎప్పటికీ రాజీపడదు. దీనికి మనం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని నాకు తెలుసు. కానీ నేను దానికి సిద్ధంగా ఉన్నాను. భారతదేశం సిద్ధంగా ఉందని తెలిపారు.
గత వారం ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 25% దిగుమతి సుంకాలు విధించగా, తాజాగా మరో 25% సుంకాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. దీని వల్ల మొత్తం దిగుమతి సుంకం 50 శాతానికి చేరింది. ఇది అమెరికా ఏదైనా దేశంపై విధించిన అత్యధిక సుంకాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

భారత్-రష్యా చమురు వ్యాపారాన్ని ప్రధాన కారణంగా పేర్కొంటూ అమెరికా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. వైట్ హౌస్ విడుదల చేసిన ప్రకటనలో.. రష్యా నుండి భారతదేశం చేసే చమురు కొనుగోళ్లు అమెరికాకు అసాధారణ ముప్పుగా మారుతున్నాయని ట్రంప్ పేర్కొన్నారు. మొదటి విడత 25% సుంకాలు ఆగస్టు 7 నుండి అమల్లోకి రాగా, రెండవ విడత సుంకాలు ఆగస్టు 27 నుండి అమల్లోకి రానున్నాయి.
ఈ చర్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.ఇవి అనవసరమైనవి, అన్యాయమైనవి, అసమంజసమైనవని MEA పేర్కొంది. భారతదేశం ఎప్పుడూ తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యతనిస్తుంది అని తెలిపింది.
అవసరమైన అన్ని వ్యూహాత్మక చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. MEA తన ప్రకటనలో.. భారతదేశం చేసే దిగుమతులు మార్కెట్ ఆధారితంగా ఉంటాయి. 1.4 బిలియన్ భారతీయుల ఇంధన భద్రతను కల్పించడమే మా లక్ష్యం. ఈ అంశంలో మన వైఖరిని అమెరికాకు ఇప్పటికే తెలియజేశామని పేర్కొంది.
రైతులు, పాడిపరిశ్రమ కార్మికులు, మత్స్యకారులు హక్కులను కాపాడుకునేందుకు ఎందాకైనా వెళతామని భారత్ స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను తాకట్టు పెట్టబోమని తేల్చి చెప్పింది. దేశ భద్రత అంటే కేవలం సైనిక పరిరక్షణ కాదు. ఇది ఆహార భద్రత, ఇంధన భద్రత, రైతు భద్రత అన్నింటినీ కలిగి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇటీవలకాలంలో కేంద్రం సాగు చట్టాల పునరాలోచన, పీఎంఎస్‌ఎస్‌వై (PM-SSY), మినిమం సపోర్ట్ ప్రైస్ (MSP) మీద స్పష్టత కల్పించడం వంటి చర్యలు మోదీ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో తీసుకుంది. ఇప్పుడు అంతర్జాతీయ వాణిజ్య ఒత్తిడుల మధ్య కూడా మోదీ రైతుల ప్రయోజనాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది.


Click it and Unblock the Notifications