భారీ ధరల ఎఫెక్ట్, 3 ఏళ్ల దిగువకు పసిడి డిమాండ్ పతనం
బంగారం ధరలు భారీగా పెరగడంతో కొనేవారు తగ్గుతున్నారట. ఈ మేరకు వరల్డ్ గోల్డ్ కౌన్సెల్ (WGC) నివేదికలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పసిడికి ఈ ఏడాది డిమాండ్ భారీగా తగ్గిపోవచ్చునని అంచనా వేసింది. ధరలు రెండు మూడు నెలల్లోనే అనుకోకుండా ఎక్కువగా పెరగడంతో కొనుగోలుదారులు వెనుకాడుతున్నారట. దీంతో ఈ ఏడాది సేల్స్ మూడేళ్ల కనిష్టానికి చేరుకోవచ్చునని WGC అంచనా వేసింది. ఇటీవల బంగారం ధరలు జీవనకాల గరిష్టానికి చేరుకొని రూ.40,000 దాటిన విషయం తెలిసిందే.

8 శాతం వరకు తగ్గనున్న బంగారం డిమాండ్
గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది (2019)లో బంగారానికి డిమాండ్ 8 శాతం మేర తగ్గుతుందని అంచనా ఉందని, 2016 నుంచి ఇది కనిష్టం కానుందని WGC ఇండియా ఆపరేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరం అన్నారు. ఈ క్యాలెండర్ ఇయర్ మూడో క్వార్టర్‌లో భారత్‌లో బంగార వినియోగం డిమాండ్ గత ఏడాది కంటే భారీగా తగ్గింది. ధరలు భారీగా పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం తగ్గడం వంటి కారణాలు బంగారం వినియోగ డిమాండ్ తగ్గుదలకు కారణంగా చెబుతున్నారు.

గ్రామీణంలో తగ్గిన డిమాండ్
ఈ ఏడాది బంగారం వినియోగం 700 టన్నులుగా ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మూడేళ్లలో ఇదే కనిష్టం కానుంది. సెప్టెంబర్ నెలలోను బంగారానికి డిమాండ్ భారీగా తగ్గింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయని, దీంతో బంగారం డిమాండ్ తగ్గుతుందని అంచనా వేసినట్లు సోమసుందరం తెలిపారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పసిడి కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి.

మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణం నుండే
బంగారానికి మూడింట రెండొంతుల డిమాండ్ గ్రామీణ ప్రాంతం నుంచి ఉంటుందని చెబుతున్నారు. సెప్టెంబర్ నెలలో గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములకు ఆల్ టైమ్ హై రూ.39,885కి చేరుకుంది. 2019 దీని ధర 22 శాతం మేర పెరిగింది. అంతర్జాతీయ పరిణామాలతో పాటు రూపాయి విలువ తగ్గడం కూడా బంగారం ధర పెరగడానికి మరిన్ని కారణాలు.


Click it and Unblock the Notifications