LPG Prices: ఇంధన కొరతపై కేంద్రం క్లారిటీ! దేశంలో ఎన్ని రోజుల నిల్వలు ఉన్నాయో తెలుసా?
పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాల నేపథ్యంలో భారత్‌లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు (LPG prices) పెరుగుతాయేమోనన్న ఆందోళన అందరిలోనూ మొదలైంది. అయితే, ఈ విషయంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి నగరవాసులకు , దేశ ప్రజలకు ఒక తీపి కబురు చెప్పారు. దేశంలో ఇంధన నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు రావని ఆయన స్పష్టం చేశారు.

మన దగ్గర ఎన్ని రోజుల నిల్వలు ఉన్నాయి?
ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో పాల్గొన్న మంత్రి, దేశ భద్రత , ఇంధన అవసరాల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. ప్రస్తుతం భారత్ వద్ద..
- 69 రోజులకు సరిపడా క్రూడ్ ఆయిల్ (ముడి చమురు) , ఎల్‌ఎన్‌జి (LNG) నిల్వలు ఉన్నాయి.
- 45 రోజులకు సరిపడా ఎల్‌పీజీ (LPG) నిల్వలు సిద్ధంగా ఉన్నాయి.
గతంలో రోజుకు 35,000 టన్నులుగా ఉన్న ఎల్‌పీజీ ఉత్పత్తిని ఇప్పుడు 54,000 టన్నులకు పెంచినట్లు ఆయన తెలిపారు. దీనివల్ల గృహ అవసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ఎక్కడా అంతరాయం కలగదు.
రష్యా గ్యాస్‌కు 'నో' చెప్పిన భారత్!
ఇదే సమయంలో ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అమెరికా ఆంక్షల పరిధిలో ఉన్న రష్యాకు చెందిన 'పోర్టోవాయా' ప్లాంట్ నుండి ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) కొనడానికి భారత్ నిరాకరించింది. ఆంక్షలు ఉన్న ఏ వస్తువును తాము కొనుగోలు చేయబోమని రష్యా డిప్యూటీ ఎనర్జీ మినిస్టర్‌కు భారత్ ముందే స్పష్టం చేసింది. ఈ కారణంగా రష్యా నుంచి గ్యాస్‌తో వచ్చిన ఒక భారీ నౌక ఇప్పుడు సింగపూర్ సమీపంలో సముద్రం మధ్యలోనే నిలిచిపోయింది. భారత్ ఎప్పుడూ రష్యా నుండి ఎల్‌ఎన్‌జి దిగుమతి చేసుకోలేదని కూడా మంత్రి పూరి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ధరల నియంత్రణలో ఆయిల్ కంపెనీల పాత్ర
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నా, దేశీయంగా గ్యాస్ ధరలు (LPG prices) , పెట్రోల్ ధరలు పెరగకుండా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCs) భారీ నష్టాలను భరిస్తున్నాయి. సామాన్యులపై భారం పడకుండా ఈ కంపెనీలు తమ లాభాలను వదులుకుంటున్నాయని, అయితే ఇది ఎంతకాలం సాధ్యమవుతుందనేది మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది వచ్చిన లాభాలన్నీ ఈ నష్టాల వల్ల తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
పొదుపు మంత్రం - ప్రధాని విజన్
యుద్ధం ఇలాగే కొనసాగితే ఆర్థికంగా దేశంపై భారం పడకుండా ఉండాలని, అందుకే ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంధన పొదుపు గురించి మాట్లాడారని మంత్రి తెలిపారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా మన వనరులను జాగ్రత్తగా వాడుకోవడం అవసరమని ఆయన పిలుపునిచ్చారు. ఏది ఏమైనా, ప్రస్తుతం మన దగ్గర ఉన్న నిల్వలతో రాబోయే రెండు నెలల వరకు ఎలాంటి గ్యాస్ లేదా చమురు కష్టాలు రావని కేంద్రం గట్టి నమ్మకంతో ఉంది.


Click it and Unblock the Notifications