భారత్ ప్రస్తుతం భారీ మందగమనాన్ని ఎదుర్కొంటోందని, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఐసీయూ దిశగా పయనిస్తోందని ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ అన్నారు. ఆర్థిక రంగ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మహా మాంద్యం ఉందన్నారు. ప్రస్తుతం భారత బ్యాంకులు, రియల్ ఎస్టేట్, మౌలిక వసతుల కంపెనీలు, NBFCల కారణంగా గత నాలుగు బ్యాలెన్స్ షీట్స్ సంక్షోభం ఎదుర్కొంటోందన్నారు. ఇది సాధారణమైన మాంద్యం మాత్రం కాదని హెచ్చరించారు.

అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా...
ఉక్కు, విద్యుత్, ఇన్ఫ్రా కంపెనీలకు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారడంతో టీబీఎస్ 1 (ట్విన్ బ్యాలెన్స్ షీట్) అయితే నోట్ల రద్దు అనంతరం NBFCల్లో ఏర్పడిన సంక్షోభం టీబీఎస్ 2 అని అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా భారత దీర్ఘకాలిక వృద్ధి మందగించిందని, పెట్టుబడులు, ఎగుమతులు మందగించడం ఇందుకు కారణమని పేర్కొన్నారు.

వినియోగం కూడా తగ్గింది..
ఇప్పుడు వినియోగం కూడా మందగించడంతో ఇటీవలి కాలంలో వృద్ధి రేటు గణనీయంగా ప్రభావితమైందన్నారు. ఆర్థిక రంగం క్షీణత దిశగా నడుస్తోందనేందుకు ఇది సంకేతమన్నారు. ప్రస్తుత పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు ఉద్దీపనలు అవసరం లేదని అభిప్రాయపడ్డారు.

పన్నులు తగ్గిస్తే లాభం లేదు
అలాగే, వ్యక్తిగత పన్ను తగ్గించడం వల్ల లేదా జీఎస్టీ రేట్లను పెంచడం వల్ల కూడా ప్రయోజనం ఉండదని సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. కానీ ద్రవ్య పరపతి సమీక్షలో వడ్డీ రేట్లను తగ్గించడం ఒక్కటే మంచిదన్నారు. జీడీపీ, వినిమయం, ఉద్యోగ కల్పన, ఆర్థిక, ఎన్పీయేలతో ఇబ్బంది పడుతున్న బ్యాంకులు గట్టెక్కాలని చెప్పారు. జీఎస్టీ రేట్లను సవరిస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి మార్పు నిర్ణయం తీసుకోలేదు. అలాగే బడ్జెట్లో వ్యక్తిగత పన్నులో మార్పులు చేస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఇవి సరికాదనేది ఆయన అభిప్రాయం.


Click it and Unblock the Notifications