ఆహార ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తున్న భారత్.. గ్లోబల్ సౌత్ లీడర్‌గా ఇలా చేయడం సరైనదా..?
Food Inflation: ప్రపంచంలో ఏ దేశమూ స్వయం సమృద్ధితో ఉండదు. కొన్ని రకాల ఉత్పత్తుల కోసం ఇతరులపై ఆధారపడక తప్పదు. అంతర్జాతీయంగా పలు దేశాలకు భారత్ ఆకలి తీరుస్తోంది. అయితే ఇటీవల ఇండియా తీసుకున్న నిర్ణయం ప్రపంచంపై భారీ ప్రభావం చూపిస్తున్నట్లు బ్లూమ్ బెర్గ్ నివేదించింది.
అత్యంత పేద దేశాల్లోని ఆహార ధరలకు రెక్కలు వచ్చాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఎల్ నినో, బియ్యం ఎగుమతులపై భారత్ నిర్ణయాలు వెరసి వివిధ ప్రాంతాల్లో ఆహార సంక్షోభం ఏర్పడింది. ఇండియాలో వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరుగనుండగా.. అస్థిర ధరలకు సంబంధించిన భయాందోళనలతో భారత ప్రభుత్వం బియ్యం సహా గోధుమల ఎగుమతులపై నిషేధం మరియు అధిక పన్నులు విధించింది.

ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడితే ఓటర్ల నుంచి తీవ్ర ప్రతిఘటన తప్పదని భావించిన భారత ప్రభుత్వం.. ఆంక్షలు విధించినట్లు బ్లూమ్ బెర్గ్ పేర్కొంది. గతేడాది గోధుమలు, చక్కెర విషయంలోనూ ఇలాగే ప్రవర్తించినట్లు తెలిపింది. కాగా 12 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా చక్కెర రేట్లు పెరిగినట్లు గుర్తుచేసింది. ప్రధాన ఎగుమతిదారు వియత్నాం సైతం ఇదే బాటలో నడుస్తోంది.
గోధుమలను ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ చాలా ముఖ్యమైనది. ఇక బియ్యం మార్కెట్ లో అయితే ఆధిపత్యం చెలాయించే స్థాయిలో ఉంది. దీంతో ప్రపంచ బియ్యం ఎగుమతుల్లో 40 శాతానికి ఇండియా ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ స్థానంలో ఉన్న దేశం ఒక్కసారిగా ఆంక్షలు విధించే సరికి.. గత నెల బియ్యం ధరలు 28 శాతం పెరగ్గా, ఈ నెలలో 15 ఏళ్ల గరిష్ఠానికి చేరినట్లు UN ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అంచనా వేసింది.
గ్లోబల్ సౌత్ లీడర్ గా కొనసాగుతున్న భారత్ నిర్ణయం వల్ల నష్టపోయేది కేవలం పశ్చిమ దేశాలే కాదు అని గుర్తుచుకోవాలని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది. ఆఫ్రికాలోని 9 సబ్-సహారా దేశాల్లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధాన ఆహార దిగుమతిదారుల్లో పేదరికం రేటు 3 నుంచి 5 శాతం వరకు చేరుతోందని ప్రపంచ బ్యాంకు ఆర్థికవేత్తలు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications