India Debt: అప్పుల కుప్పగా అఖండ భారత్.. 9 ఏళ్లలో ఏకంగా 100 లక్షల కోట్లు పెరిగిన రుణభారం
India Debt: ఆంగ్లేయుల పాలన నుంచి విముక్తి పొందిన భారత్.. రేపు 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతోంది. ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే అప్పటికీ, ఇప్పటికీ పలు మార్పులు సంభవించాయి. అభివృద్ధిలో భారత్ అజేయంగా దూసుకుపోతోంది. కానీ భారీ అప్పుల ఊబిలోనూ కూరుకుపోతుండటం మాత్రం విచారకరం.
గత తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వ రుణాలు 174 శాతం పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో బాహ్య రుణంలో పెరుగుదల 100 శాతం నమోదైంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం.. మార్చి 31, 2014 నాటికి కేంద్ర ప్రభుత్వ అప్పు 58.6 లక్షల కోట్లు అంటే GDPలో 52.2 శాతం. అయితే మార్చి 31, 2023 నాటికి ఇది కాస్తా 174 శాతం పెరిగి 155.6 లక్షల కోట్లకు అనగా GDPలో 57.1 శాతానికి పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

2013-14లో ప్రభుత్వ బాహ్య రుణం 3 లక్షల 74 వేల 484 కోట్లు కాగా.. 2022-23 నాటికి 100 శాతం పెరిగి 7 లక్షల 48 వేల 895 కోట్లకు చేరుకుంది. ఇందులో అధిక భాగం బహుపాక్షిక, ద్వైపాక్షిక ఏజెన్సీల ద్వారా సమకూర్చుకున్నదే. అయినప్పటికీ రిస్క్ ప్రొఫైల్ సురక్షితంగానూ, హ్యాండిల్ చేయగలిగిన పరిమితిలోనే ఉన్నట్లు అధికార గణం పేర్కొంటోంది.
కేవలం 2019-21 మధ్య కేంద్రం రుణంలో 16 శాతం పెరుగుదల నమోదైంది. 2019-20 చివరి నాటికి ఈ అప్పు 105.1 లక్షల కోట్లు కాగా.. 2020-21 ముగింపు సమయానికి 121.9 లక్షల కోట్లకు చేరుకుంది. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఆర్థిక అంచనాలు తలక్రిందులు కావడంతోనే ఇలా జరిగినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications