భారత ఆర్థిక వ్యవస్థ రికవరీపై శక్తికాంతదాస్ కీలక వ్యాఖ్యలు!
కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న భారతఆర్థిక వ్యవస్థ రికవరీకి చేరువలో ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(rbi) గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు, ఆర్బీఐ సరళ పరపతి సమీక్ష విధానాలు, ద్రవ్య పరపతి విధానాల వల్ల ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందన్నారు. ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఎన్‌కే సింగ్ రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థలన్నింటి వద్ద వృద్ధికి మద్దతు ఇచ్చేందుకు సరిపడే మూలధనం ఉందన్నారు. కరోనా వైరస్ పరిస్థితి స్థిరపడ్డాక బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు అంతర్గతంగా ఒత్తిడి పరిశీలన చేసుకోవాలని, మూలధన నిల్వలు పెంచుకోవాలన్నారు. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్య విస్తరణ మార్గాన్ని పాటిస్తున్నామని, ఆర్బీఐ వద్ద లేని అస్త్రాలను కూడా వినియోగించామని చెప్పారు.

నిధులు సమకూర్చుకోవడం..
కరోనా సవాళ్లను ఎదుర్కోవడానికి ద్రవ్యలోటు లక్ష్యాన్ని పక్కన పెట్టి మరిన్ని నిధులు ఖర్చు చేయక తప్పలేదని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చాక ప్రభుత్వం ద్రవ్య విధాన లక్ష్యాలను ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ఆర్బీఐ నిర్ణయాలు రికవరీకి దోహదం చేశాయన్నారు. కొన్ని సంస్థలు ఇప్పటికే నిధులు సమకూర్చుకున్నాయని చెప్పారు. మిగతా సంస్థలు వచ్చే కొద్ది నెలల్లో నిధులు సమకూర్చుకుంటాయని చెప్పారు. కరోనా కష్టాల నుండి ఆర్థిక వ్యవస్థ చాలా వరకు బయట పడిందన్నారు.

బ్యాంకులకు ద్రవ్యలోటు కోసం..
వ్యవసాయం, రిటైల్, ఔషధ ఎంఎస్ఎంఈల వంటి పలు రంగాలకు ద్రవ్య లభ్యత సమకూర్చేందుకు బ్యాంకులకు రూ.లక్ష కోట్ల విలువైన ఆన్ టాప్ టార్గెటెడ్ లాంగ్ టర్మ్ రెపో కార్యకలాపాలను ఆర్బీఐ బుధవారం ప్రకటించింది. ఈ సదుపాయం కింద బ్యాంకులు పెట్టుబడులకు కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది.

వివేకవంతమైన చర్యలు
బలహీనవర్గాలకు, చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం వివేకవంతమైన చర్యలను ప్రకటించిందని శక్తికాంతదాస్ అన్నారు. కరోనా నేపథ్యంలో కుదేలైన ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడంలో భాగంగా మరిన్ని ఉద్దీపన చర్యలను ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ దిశగా ఆర్థిక శాఖ నుండి ఆదేశాలు వచ్చాయని, ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి తరుణ్ బజాజ్ నిన్న తెలిపారు.


Click it and Unblock the Notifications