న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి అమల్లోకి వచ్చిన నిత్యావసర సరుకుల రేట్లను కేంద్ర ప్రభుత్వం సవరించింది. వాటి రేట్లను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఒక్కో నిత్యావసర వస్తువు రేటులో చోటు చేసుకున్నపెరుగుదలను చూస్తే కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఉప్పు, పప్పు సహా దేన్నీ వదల్లేదు కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేకించి వంటనూనెల ధరలు.. వేడి చేయకముందే సలసలమంటూ మరుగుతున్నాయి. వంటింటికి సంబంధించినంత వరకు దాదాపు అన్ని రకాల వస్తువుల్లోనూ పెరుగుదల కనిపించింది.. ఒక్క చక్కెరలో తప్ప.

నిత్యావసర వస్తువులు రేట్లు భగ్గు..
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లో తాజాగా పొందుపరిచిన ధరల ప్రకారం.. వంటనూనెల్లో భారీగా పెరుగుదల చోటుచేసుకుంది. వంటనూనెలో 47 శాతం పెరుగుదల నమోదైంది. గత ఏడాది ఏప్రిల్ నాటికి.. ఈ ఏప్రిల్ నాటికి నమోదైన పెరుగుదల ఇది. ఈ సంఖ్య పప్పు దినుసుల్లో 17 శాతం మేర కనిపించింది. విడి టీ పొడి రేటు 30 శాతం మేర పెరిగింది. బియ్యం, పప్పులు, గోధుమలు, ఆవనూనె, సోయాబీన్ నూనె, టీ, ఉప్పు వంటి అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సవరించింది. బియ్యం ధరలో 14.65, గోధుమల రేట్లు 3.6 శాతం మేర పెరిగాయి. చక్కెర, బంగాళాదుంప, ఉల్లిపాయల, టమోటాల రేట్లు మాత్రమే తగ్గినట్లు ఆ మంత్రిత్వ శాఖ పేర్కొంది.

వంటనూనెల రేట్లల్లో పెరుగుదల ఇలా..
ప్రత్యేకించి- వంటనూనెల ధరల్లో 47 శాతం మేర పెరుగుదల కనిపించడం సామాన్య ప్రజలపై ఏ రేంజ్‌లో భారం పడిందనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. పామాయిల్ ప్యాకెట్ ధర గత ఏడాది ఏప్రిల్‌లో 87 రూపాయలు ఉండగా.. ఈ ఏప్రిల్‌లో దాని ధర 121 రూపాయలుగా నమోదైంది. ఈ ఏడాది కాలంలో సన్ ఫ్లవర్ ఆయిల్ ధర 106 రూపాయల నుంచి 157 రూపాయలకు చేరింది. వనస్పతి నూనె రేటు గత ఏడాది ఏప్రిల్‌లో లీటర్ పాకెట్ ఒక్కింటికి 88 రూపాయలు ఉండగా.. ప్రస్తుతం దాని ధర 121 రూపాయలు పలుకుతోంది. వేరు శనగ నూనె ఇదివరకు 139 రూపాయలు ఉండగా.. ఇప్పుడు దాని రేటు 165 రూపాయలు. సోయాబీన్ నూనె 99 నుంచి 133 రూపాలయకు ఎగబాకింది.

వంటనూనెతో పోటీ పడుతోన్న పప్పు దినుసులు..
వంటనూనెతో పప్పు దినుసుల రేట్లు పోటీ పడుతున్నాయి. కందిపప్పు, పెసరపప్పు, ఉద్దిపప్పు.. ఇలా అన్ని రకాల పప్పు దినుసుల రేట్లు పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వాటి ధరల్లో చోటు చేసుకున్న మార్పులను తన వెబ్‌సైట‌్‌పై పొందుపరిచింది. రేట్లు తగ్గినవి ఏవైనా ఉన్నాయీ అంటే చక్కెర, బంగాళాదుంపలు, టమోటా, ఉల్లిపాయల రేట్లు మాత్రమే. బంగాళాదుంపల ధరలు 34 నుంచి 27 శాతానికి తగ్గాయి. ఉల్లిపాయల ధర 32 నుంచి 26 శాతం, టమోటా 25 నుంచి 17 శాతానికి తగ్గినట్లు పేర్కొంది. వాస్తవానికి ఇదివరకటి ధరలతో పోల్చుకుంటే.. స్వల్పంగా మాత్రమే అవి సామాన్యుడికి ఊరటనిస్తున్నాయి.


Click it and Unblock the Notifications