5G మొబైల్ నెట్‌వర్క్ వినియోగదారులు ప్రతి ఇద్దరిలో ఒకరు కాల్ డ్రాప్, కనెక్షన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం టెలికం కంపెనీలు (టెల్కోలు) సాధ్యమైనంత ఎక్కువగా 5Gని అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాయి.
కానీ నాణ్యత విషయంలో వినియోగదారుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేక పోతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాలకు మాత్రమే పరిమితమైన ఈ సమస్యలు ఇప్పుడు ఢిల్లీ, ముంబై సహా మెట్రో నగరాలకు సైతం విస్తరించాయని వినియోగదారులు పేర్కొంటున్నారు.

సగం మందికి సమస్యలే
దేశంలోని 185 జిల్లాల్లో మొత్తం 34 వేల మంది మొబైల్ వినియోగదారులపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. వారిలో 11 వేల మంది 5G వినియోగదారులు కాగా మిగిలిన వారు 3G/4G ఉపయోగిస్తున్నారు. మొత్తం 5G వినియోగదారుల్లో వారిలో సగం మంది తమ కాల్స్‌లో 25 శాతంకు పైగా కాల్ కనెక్షన్, కాల్ డ్రాప్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు అందులో చెప్పారు. తమ కాల్స్‌లో 50 శాతానికి పైగా ఇదే విధమైన నాణ్యతా ఇబ్బందులు అనుభవిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న సగం మంది పేర్కొన్నారు.

వేగం ఓకే కానీ...
సేవల్లో నాణ్యతా లోపంపై టెలికం కంపెనీలు లోతైన విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వే అభిప్రాయపడింది. వివిధ రకాల సేవల వినియోగంపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలంది. అక్టోబర్‌లో 5G సేవలు ప్రారంభించినప్పుడు, 58 శాతం మొబైల్ వినియోగదారులు కాల్ కనెక్షన్, కాల్ డ్రాప్ విషయంలో మెరుగుదలని ఆశిస్తున్నట్లు చెప్పారు.
51 శాతం మంది డేటా వేగం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారని వెల్లడించింది. 5G అనంతరం డేటా వేగం మెరుగుపడినట్లు అనేకమంది భావించడం శుభసూచికంగా కనిపిస్తుండగా.. నాణ్యత విషయంలోనే ప్రభుత్వం, టెల్కోలు తగు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.

ప్రభుత్వం రెడీ
టెలికం ఆపరేటర్లతో టెలికమ్యూనికేషన్స్ విభాగం అధికారులు గత నెలలో సమావేశం నిర్వహించారు. సేవలు, ప్రమాణాల నాణ్యతను మెరుగుపరచాలని కంపెనీలను కోరారు. ప్రభుత్వ తరఫున పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ల నాణ్యతా లోపం, చట్టవిరుద్ధంగా అక్రమ బూస్టర్‌లు, జామర్‌ల వినియోగమూ కాల్ డ్రాప్స్, డేటా సేవలపై తీవ్ర ప్రభావితం చూపుతున్నట్లు టెల్కోలు అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications