IT rules: దేశంలోని వ్యక్తుల మరియు సంస్థల ఆదాయానికి సంబంధించి పలు పన్ను నియమాలు ఉన్నాయి. సాధారణ పౌరులు వినియోగించే బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలు మరియు డిపాజిట్లపై కూడా పరిమితులు ఉన్నాయి. వాటిలో నగదు జమ సహా ఉపసంహరణకు ఉన్న నియమ నిబంధనలను పౌరులు పాటించాల్సిందే. వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తే ఆదాయపు పన్ను శాఖ కొరడా ఝళిపిస్తుంది.
రోజువారీ ఉపయోగించే సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, UPI లావాదేవీలు, నగదు డిపాజిట్ మరియు ఉపసంహరణలను ఆదాయపు పన్ను శాఖ నిశితంగా గమనిస్తూ ఉంటుంది. పెద్ద మొత్తాన్ని ఒకేసారి జమచేయడం లేదా విత్ డ్రా చేస్తే కచ్చితంగా IT రాడార్‌లోకి వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ఖాతాల విషయంలో IT నియమ, నిబంధనలు తెలుసుకుని తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది.

IT నిబంధనలు ప్రకారం సేవింగ్స్ ఖాతాలో నగదు డిపాజిట్‌పై పరిమితి ఉంది. ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే, ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదించాల్సి ఉంటుంది. అదే కరెంట్ ఖాతా అయితే ఈ లిమిట్ 50 లక్షలుగా ఉంది. ఈ తరహా భారీ లావాదేవీలను ఆయా ఆర్థిక సంస్థలే IT శాఖకు తెలియజేస్తాయి. అయితే ఈ నగదుపై తక్షణమే పన్ను విధించబడదని గమనించాలి.
ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ ఖాతా నుంచి 1 కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే, దానిపై 2 శాతం TDS విధించబడుతుంది. 20 లక్షల కంటే ఎక్కువ విత్ డ్రా చేసి, మూడేళ్లుగా ITR దాఖలు చేయకపోయినా 2 శాతం TDS మినహాయించబడుతుంది. ఒకవేళ అటువంటి వ్యక్తులు ఈ నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో 1 కోటి ఉపసంహరించుకుంటే అప్పుడు 5 శాతం TDS చెల్లించాల్సి వస్తుంది.


Click it and Unblock the Notifications