Rice Price: కిలో బియ్యం రూ.95.. ఇక సన్న బియ్యం దొరకడం కష్టమే..!
దేశంలో సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సన్న బియ్యం ధరలు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలకు అందకుండా పోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో సతమతమవుతున్న ప్రజానీకానికి బియ్యం ధరలు మరింత భారంగా మారుతున్నాయి. తెలంగాణలో కిలో బియ్యం సెంచరీ దిశగా పరుగులు పెడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో సూపర్ ఫైన్ రకం బియ్యం కిలో ధర రూ.90 నుంచి రూ.95 వరకు పలుకుతున్నట్లు పలువురు చెబుతున్నారు. ఇక సూపర్ ఫైన్ మీడియం రకం రూ.85 నుంచి రూ.90, ఫైన్ రకం రూ.78 నుంచి రూ.80 వరకు చేరింది.
త్వరలోనే సన్న బియ్యం కిలోకు రూ. 100కు చేరే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావంతో వరి సాగు 15లక్షల ఎకరాలు తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వరి సాగులో సన్న వరి సాగు చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలోనే దిగుబడి గణనీయంగా తగ్గుతుందనే అంచనాలు ఉన్నాయి. దీన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. మార్కెట్లో బియ్యం నిల్వలు తగ్గుతున్నాయనే ప్రచారం ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే కొత్త బియ్యం వచ్చే వరకు ఈ సమస్య తప్పదని నిపుణులు చెబుతున్నారు.

కొద్ది రోజుల క్రితం వరకు 25 కిలోల బియ్యం బ్యాగ్ ధర రూ.2 వేలుగా ఉండగా.. బుధవారం నాటికి రూ.2,450కు చేరినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. హోల్సేల్ మార్కెట్లోనూ క్వింటాల్ బియ్యంపై దాదాపు రూ.1,200 వరకు పెరుగుదల నమోదు అయింది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్ (తెలంగాణ సోనా) వంటి సన్న రకాలతోపాటు ప్రీమియం రకాల ధరలు భారీగా పెరుగుతున్నాయి.
రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం ఫైన్ రకం బియ్యం కిలో రూ.80కి పైగా ధరలు వరకు అమ్ముతున్నారు. వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. జై శ్రీరామ్ వంటి ప్రీమియం రకాల ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.
సన్న బియ్యం ధరలు జూలై నుంచి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రీమియం రకం జై శ్రీరామ్ ధరలో భారీ మార్పు ఉంది. జూన్ లో క్వింటాల్ ధర రూ.5,600 నుంచి రూ.6,300 మధ్య ఉండగా.. ఆగస్టు నాటికి రూ.6,300కు చేరింది. అక్టోబర్ లో నాణ్యత, బ్రాండ్ ను బట్టి రూ.8,400 నుంచి రూ.9,200 వరకు చేరింది. అంటే మూడు నెలల్లోనే క్వింటాల్ దాదాపు రూ.3 వేల వరకు పెరిగింది. హెచ్ఎంటీ, బీపీటీ, ఆర్ఎన్ఆర్ వంటి రకాల ధరలు కూడా పెరిగాయి. దీంతో సన్న వడ్లకు కూడా డిమాండ్ పెరిగింది. రైతుల నుంచి క్వింటా సన్న వడ్లను రూ.3 వేల నుంచి రూ.3,500 కొనుగోలు చేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications