Farmer Loan Waiver: తొలిదశలో 11.50 లక్షల కుటుంబాలకు రైతు రుణ మాఫీ..
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల హామీల్లో ఒకటైన రైతు రుణ మాఫీకి రంగం సిద్ధం చేశారు. పంట రుణమాఫీలో భాగంగా ఈ నెల 18న తొలి రోజు 11.50 లక్షల కుటుంబాలకు ఒకే దఫాలో రూ. లక్ష వరకు రుణాలు మాఫీ చేయనున్నారు. గురువారం సాయంత్రం కల్లా రైతుల రుణ ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చెప్పారు.
అదే రోజు రైతు వేదికల్లో రైతు సంబరాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్నా ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు పంట రుణాలు ఇచ్చే 32 బ్యాంకుల్లో 60 లక్షల క్రాఫ్ లోన్ అకౌంట్లు ఉన్నట్లు వివరించారు. వారిలో 39 లక్షల కుటుంబాలకు చెందిన రైతులు రూ.2 లక్షల పంట రుణాలు అధికారులు నివేదిక ఇచ్చారని వివరించారు.

తొలిరోజున ఒకేసారి 11.50 లక్షల కుటుంబాలకు రూ.లక్షలోపు పంట రుణాలను మాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. తొలిరోజున రుణమాఫీకి రూ.6 వేల కోట్లకు పైగా నిధులు అవసరమవుతాయన్నారు. రుణ మాఫీ కోసం ప్రభుత్వం విడుదల చేసే నిధులను.. ఇతర ఖాతాల్లో జమ చేయకుంటే బ్యాంకర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఆగస్ట్ 15 లోపు రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు.
18వ తేదీ రైతు వేదికల్లో జరిగే సంబురాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం సూచించారు. పంట రుణాలు రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్న రైతులు.. మిగతా డబ్బును వారే కట్టుకోవాలని అధికారులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications