Onion Price: కిలో ఉల్లి రూ.25 లే.. ఎక్కడంటే..!
దేశంలో కొద్ది నెలల క్రితం టమాటా ధర భారీగా పెరిగిన సంగతి తెసిందే. అయితే ఇప్పుడు టమాటా ధర భారీగా పడిపోగా.. ఉల్లి ధర మాత్రం భారీగా పెరుగుతోంది. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. దేశంలో అతిపెద్ద ఉల్లిపాయల సరఫరాదారు అయిన నాసిక్‌లో సరఫరా అంతరాయాల కారణంగా ఉల్లి ధర కిలోకు రూ. 25 నుంచి రూ.60కి పెరిగింది. రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధర ఒక్కసారిగా కిలో రూ.60కి పెరగడం వినియోగదారులతో పాటు వ్యాపారులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఉల్లిపాయల భారీగా పెరిగిన నేపథ్యంలో రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయల విక్రయాన్ని సబ్సిడీపై కిలోకు 25 రూపాయలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన డేటా ప్రకారం, అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో ఉల్లిపాయల సగటు రిటైల్ ధర కిలోకు రూ. 30 గా ఉంది. వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆగస్టు మధ్య నుంచి బఫర్ ఉల్లిపాయలను మార్కెట్‌లోకి విడుదల చేశామన్నారు.

మరింత ధరల పెరుగుదలను అరికట్టడానికి, వినియోగదారులకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం వాటి రిటైల్ పంపిణీని ముమ్మరం చేస్తోందని చెప్పారు. ధరలు గణనీయంగా పెరిగిన రాష్ట్రాల్లో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయలను సరఫరా చేస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. 22 రాష్ట్రాలలో సుమారు 1.7 లక్షల టన్నుల బఫర్ ఉల్లిపాయలు ఆగస్టు మధ్య నుంచి వివిధ ప్రదేశాలలో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
రిటైల్ మార్కెట్‌లలో బఫర్ ఉల్లిపాయలు రెండు సహకార సంస్థల ద్వారా కిలోకు రూ. 25 సబ్సిడీపై పంపిణీ చేస్తున్నారు. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ (NCCF), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ ఉల్లి నాట్లు ఆలస్యం కావడంతో ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఖరీఫ్ ఉల్లిపాయలు ఇప్పటికే మార్కెట్‌లోకి రావాల్సి ఉండగా వాటి రాక ఆలస్యమైంది. నిల్వ ఉన్న రబీ ఉల్లి తగ్గిపోవడం, ఖరీఫ్ ఉల్లి ఆలస్యమవడంతో సరఫరా పరిస్థితి కఠినతరం కావడంతో హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌లలో ధరల పెరుగుదలకు దారితీసింది.


Click it and Unblock the Notifications