Telangana: తెలంగాణలో రికార్డ్ స్థాయిలో పెరిగిన వస్తువుల ఎగుమతులు..!
తెలంగాణలో వస్తువుల ఎగుమతులు 68.3 శాతం వృద్ధిని నమోదు అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని చివరి మూడు ఏళ్లతో పోలిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడు ఏళ్లలో తెలంగాణలో వస్తువుల ఎగుమతులు పెరిగాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ (DGCI&S) అందించిన వివరాల ప్రకారం వస్తువుల ఎగుమతుల సగటు వార్షిక విలువ 2020-23 కాలంలో రూ. 79,000 కోట్లు ఉండగా, 2023-26 కాలానికి అది రూ. 1.33 లక్షల కోట్లకు పెరిగింది.
రాష్ట్ర ఎగుమతుల వృద్ధికి ఇంజనీరింగ్, ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులు దోహదపడ్డాయని పరిశ్రమల శాఖ పేర్కొంది. ఈ ఆరేళ్ల కాలంలో తెలంగాణ నుంచి వస్తువుల ఎగుమతులు 2020-21లో రూ. 64,539 కోట్ల నుంచి 2025-26 నాటికి రూ. 1,22,655 కోట్లకు పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ. 1,61,843 కోట్ల విలువైన ఎగుమతులు నమోదయ్యాయి. ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో కూడా తెలంగాణ గణనీయమైన వృద్ధిని సాధించింది. ఇంజనీరింగ్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్ (EEPC) సమాచారం ప్రకారం 2025 అక్టోబర్‌తో పోలిస్తే 2026 అక్టోబర్‌లో ఈ రంగం 69 శాతం వృద్ధిని నమోదు చేసింది.

2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని ఇదే కాలంతో పోలిస్తే ఇంజనీరింగ్ ఎగుమతులు దాదాపు 31 శాతం పెరిగాయి. వివిధ ఉత్పత్తి విభాగాల్లో, అంతర్గత దహన యంత్రాల విడిభాగాల ఎగుమతులు అత్యధికంగా 244 శాతం వృద్ధిని సాధించాయి. సీసం, సీసపు ఉత్పత్తుల ఎగుమతులు 196 శాతం పెరగగా, రాగి, రాగి ఉత్పత్తుల ఎగుమతులు 106 శాతం వృద్ధిని నమోదు చేశాయి. విద్యుత్ యంత్రాలు, యాంత్రిక పరికరాల ఎగుమతులు కలిపి 2024-25లో రూ. 14,632.20 కోట్లు ఉండగా, 2025-26లో రూ. 17,764.81 కోట్లకు పెరిగాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 29,131 కోట్ల విలువైన ఎగుమతులతో మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా వస్తువుల ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచింది.
రాష్ట్రం మొత్తం ఎగుమతుల్లో ఈ జిల్లా వాటా 23.75 శాతంగా ఉంది. రూ. 26,437 కోట్ల ఎగుమతులతో హైదరాబాద్ రెండో స్థానాన్ని దక్కించుకోగా రూ. 24,970 కోట్ల ఎగుమతులు సాధించిన సంగారెడ్డి మూడో స్థానంలో నిలిచింది. ఇతర జిల్లాల్లో కూడా తయారీ రంగ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఎగుమతులు 2024-25లో రూ. 6,818.20 కోట్లు ఉండగా.. 2025-26 నాటికి అవి రూ. 10,648.13 కోట్లకు పెరిగి, 56.17 శాతం వృద్ధిని నమోదు చేశాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎగుమతులు రూ. 3,117.97 కోట్ల నుంచి రూ. 4,119.68 కోట్లకు పెరిగి, 32.13 శాతం వృద్ధిని సాధించాయి. ఈ జిల్లాల్లో నమోదైన వృద్ధి, ప్రాంతీయ అభివృద్ధి కేంద్రాలను ప్రోత్సహించడంపై దృష్టి సారించే ప్రభుత్వ క్యూర్, ప్యూర్, రేర్ అభివృద్ధి నమూనాకు అనుగుణంగా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications