Retail Inflation: భారీగా పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం.. వడ్డీ రేట్లు పెంపు పక్కానా..!
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఉల్లిపాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడంతో ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.82 శాతానికి పెరిగింది. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం జూలైలోని 9.78 శాతం నుంచి ఆగస్టులో 9.92 శాతానికి పెరిగింది. తాజా వినియోగదారుల ధరల సూచీ (CPI) గణాంకాలు కేంద్ర బ్యాంక్ నిర్దేశించిన సహన పరిమితిలోనే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరల పెరుగుదల కారణంగా ద్రవ్యోల్బణం విషయంలో ఆందోళన కలిస్తోంది. అక్టోబర్ 5-7 మధ్య ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం కానుంది.
విధానపరమైన వడ్డీ రేట్ల నిర్ణయాలలో అధిక CPI స్థాయి కీలక పాత్ర పోషిస్తుంది. ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీ రేట్ల కమిటీ గత నెలలో కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. జూలైలో CPI ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 4.45 శాతంగా ఉంది. జనవరిలో 2024ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని కొత్త సిరీస్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆగస్టు ద్రవ్యోల్బణ గణాంకాలే అత్యధికం కావడం గమనార్హం. ఆగస్టు నెలకు సంబంధించిన CPIపై నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.23 శాతం ఉండగా.. పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.31 శాతంగా నమోదైంది.

ఆగస్టులో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం అంతకుముందు నెలలోని 5.52 శాతం నుంచి 5.95 శాతానికి పెరిగింది. ఉల్లిపాయల ద్రవ్యోల్బణం జూలైలో 22.54 శాతం ఉండగా ఆగస్టులో అది 48.27 శాతానికి చేరింది. వెల్లుల్లి ద్రవ్యోల్బణం జూలైలోని 35.36 శాతం నుంచి 43.6 శాతానికి పెరిగింది. అల్లం ధరల పెరుగుదల రేటు కూడా జూలైతో పోలిస్తే 73.82 శాతంతో అధికంగా ఉంది. మరోవైపు, టమోటా, బంగాళాదుంప, బెండకాయ ధరలు తగ్గుముఖం పట్టాయి. అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో 6.27 శాతంగా, అత్యల్పంగా మిజోరంలో 2.35 శాతంగా నమోదైంది. కీలక వడ్డీ రేటు (రెపో)ను నిర్ణయించడానికి రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకునే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ నేతృత్వంలోని MPC, అక్టోబర్ 5 నుంచి 7 వరకు సమావేశం కానుంది.
ఆగస్టు MPC సమావేశం తర్వాత ద్రవ్యోల్బణ ఆందోళనల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక స్వల్పకాలిక పాలసీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఇది 2026-27 సంవత్సరానికి CPI ద్రవ్యోల్బణాన్ని 5 శాతంగా, రెండవ త్రైమాసికంలో 4.7 శాతంగా, మూడవ త్రైమాసికంలో 5.9 శాతంగా, నాల్గో త్రైమాసికంలో 5.5 శాతంగా అంచనా వేసింది. CPI ఆధారిత ద్రవ్యోల్బణం ఇరువైపులా 2 శాతం మార్జిన్‌తో 4 శాతం వద్ద ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆర్‌బిఐని ఆదేశించింది.
2022-23ను ఆధార సంవత్సరంగా తీసుకున్న కొత్త WPI సిరీస్‌లో టోకు ధరల ద్రవ్యోల్బణం రెండవ అత్యధికంగా ఉంది. ఆగస్టులో టోకు ఆహార ద్రవ్యోల్బణం జూలైలోని 6.65 శాతం నుంచి 7.05 శాతానికి పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
